ప్రజలెవ్వరూ కూడా సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా అన్ని సర్టిఫికెట్లు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే డౌన్ లోడు చేసుకునే విధంగా ప్రజలకు తెలియజెప్పాలని ఐటీ, మరియు ఆర్టీజీ శాఖల కార్యదర్శి భాస్కర్ కాటంనేని జిల్లా కలెక్టర్లకు సూచించారు.
సచివాలయంలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా ఆయన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అమలుపై ఆయన ప్రజంటేషన్ ఇచ్చారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అద్భుతమైన సాధనమని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చేయడంలో జిల్లా కలెక్టర్లే కీలకపాత్ర పోషించాలన్నారు.
క్యాస్ట్, నేటివిటీ, జనన, మరణ ధృవీకరణ పత్రాలు ఇతరత్రా సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, దయచేసి సర్టిఫికెట్ల జారీ కోసం ప్రజలను ప్రభుత్వ కార్యాలయాలకు పిలిపించుకోకండని ఆయన కోరారు.
ఇప్పటికీ కూడా చాలా మంది అధికారులు సర్టిఫికెట్ల జారీ కోసం ప్రజలను కార్యాలయాలకు పిలిపించుకుంటున్నారని ఇది సరికాదన్నారు. జిల్లా స్థాయిలో కింది స్థాయి కార్యాలయాల్లో, అధికారులు, సిబ్బందికి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్‌లోని మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్‌లోనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్టిఫికెట్ డౌన్ లోడు చేసుకోవచ్చన్నారు.
వాట్సాప్ ద్వారా డౌన్‌లోడు చేసుకునే డిజిటల్ సర్టిఫికెట్లు సురక్షితమైనవని, అన్ని సర్టిఫికెట్లను డిజిలాకర్లో ఉంటాయని, అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని, కాబట్టి ఈ సర్టిఫికెట్లను ఎవ్వరూ కూడా ట్యాంపర్ చేయలేరని తెలిపారు.
ప్రజల్లో వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగించుకుంటే ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలుంటాయో ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. ప్రతి శుక్రవారం గ్రామవార్డు సచివాలయ సిబ్బందిని ప్రతి ఇంటికి పంపి, అక్కడ ప్రజలతో మమేకమై వారికి మనమిత్ర యాప్ ఎలా ఉపయోగించుకోవచ్చో వివరంగా తెలియజెప్పి అవగాహన కల్పించాలన్నారు.
ఇది పూర్తీగా విజయవంతం చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనన్నారు. అధికారులకు సైతం వాట్సాప్ గవర్నెన్స్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు ఆయా జిల్లాలు, మండలాల్లో అమలు ఏ స్థాయిలో ఉంది, ప్రజల సంతృప్తి ఎలా ఉందనేది మనమిత్రలోనే తెలుసుకోవచ్చన్నారు.
ఇప్పటికీ రెవెన్యూశాఖలో పనులు సంక్లిష్టంగా ఉన్నాయని మెజార్టీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం 738 రకాల సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందజేస్తున్నామని తెలిపారు. తదుపరి కూడా మరిన్ని సేవలను ఇందులో జోడిస్తామన్నారు.