రష్యా నుంచి భారీగా ముడి చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై అమెరికా ఎందుకు ఆంక్షలు విధించలేదో విదేశాంగ మంత్రి మార్కో రూబియో వివరించారు. చైనాపై ఆంక్షలు పెట్టితే ప్రపంచ ఇంధన మార్కెట్ దెబ్బతింటుందని, చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు.
‘ఫాక్స్ బిజినెస్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రూబియో చెప్పారు: "చైనా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి శుద్ధి చేసి తిరిగి ప్రపంచ మార్కెట్‌కి, ముఖ్యంగా యూరప్‌కి అమ్ముతోంది. యూరప్ దేశాలు ఇంకా రష్యా నుంచి సహజ వాయువును కూడా కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పుడు చైనాపై ఆంక్షలు పెడితే, ఆ శుద్ధి చేసిన చమురు అందుబాటులో ఉండదు. దీంతో ప్రపంచ దేశాలు అధిక ధర చెల్లించాల్సి వస్తుంది లేదా కొత్త వనరులు వెతకాల్సి వస్తుంది" అని వివరించారు.
అలాగే, చైనా–భారత్‌లపై 100% టారిఫ్‌ల బిల్లును ప్రతిపాదించినప్పుడు, అనేక యూరప్ దేశాలు వెనుకగానే తమ ఆందోళనలు వ్యక్తం చేశాయని రూబియో తెలిపారు. పత్రికా ప్రకటనల్లో కాకుండా గోప్యంగా వారు అమెరికాను ఒత్తిడి చేశారని ఆయన చెప్పారు.
"యూరప్ దేశాలు కూడా రష్యా నుంచి నేరుగా ఇంధనం కొనుగోలు చేస్తున్నాయి. వాటిపై కూడా ఆంక్షలు ఉంటాయా?" అని అడిగిన ప్రశ్నకు రూబియో సమాధానమిస్తూ – "వాటితో వాగ్వాదానికి దిగడం మాకు ఇష్టం లేదు. యూరప్ నిర్మాణాత్మకంగా వ్యవహరించగలదని మేము నమ్ముతున్నాం" అని తెలిపారు.