ప్రపంచంలో కొన్ని దేశాల కరెన్సీలు చాలా తక్కువ విలువ కలిగి ఉంటాయి. మన దగ్గర ₹500 లేదా ₹1,000 పెద్ద మొత్తంలా అనిపించకపోయినా, ఆ దేశాల్లో అదే డబ్బు లక్షల విలువైన కరెన్సీగా మారిపోతుంది. అందుకే అక్కడ మన రూపాయి విలువ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది విన్నవాళ్లకు ఆశ్చర్యంగానే ఉంటుంది కానీ నిజం.
ఇరాన్‌లో వాడే రియాల్ కరెన్సీ ప్రపంచంలోనే అతి బలహీనమైనది. ఒక రూపాయికి దాదాపు 500 రియాల్స్ వస్తాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందులు, ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత. ప్రజలకు లావాదేవీలు సులభంగా చేయడానికి రియాల్‌ను టోమాన్‌తో మార్చాలని ఆ దేశ ప్రభుత్వం ఆలోచిస్తోంది.
వియత్నాం దేశ కరెన్సీ డాంగ్ కూడా చాలా తక్కువ విలువ కలిగినదే. ఒక రూపాయికి దాదాపు 300 డాంగ్స్ వస్తాయి. దీని వెనుక ఒక కారణం కూడా ఉంది. వారి ప్రభుత్వం కరెన్సీ విలువను కావాలనే తక్కువగా ఉంచుతుంది. ఎందుకంటే అలా చేస్తే వారి ఉత్పత్తులు ఇతర దేశాలకు చౌకగా అందుతాయి. దీని వలన ఎగుమతులు పెరుగుతాయి, పెట్టుబడులు కూడా వస్తాయి.
ఇండోనేషియా కరెన్సీ రూపియాహ్ కూడా బలహీనంగానే ఉంది. ఒక రూపాయికి దాదాపు 190 రూపియాహ్ వస్తాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతున్నా, ఇంకా చమురు ధరలు, దిగుమతులపై ఆధారపడటం వలన వారి కరెన్సీ స్థిరంగా నిలవడం కష్టమవుతోంది.
అలాగే లావోస్ దేశ కరెన్సీ కిప్ కూడా చాలా తక్కువ విలువ కలిగి ఉంటుంది. ఒక రూపాయికి దాదాపు 250 నుంచి 260 కిప్ వస్తాయి. ఈ దేశం ప్రధానంగా వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తుల మీద ఆధారపడుతుంది. కాబట్టి ఆర్థికంగా బలంగా లేకపోవడం వలన కరెన్సీ విలువ పెరగడం లేదు.
గినియా దేశం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఒక రూపాయికి దాదాపు 100 ఫ్రాంక్స్ వస్తాయి. ఈ దేశంలో బాక్సైట్, ఐరన్ ఓర్ వంటి సహజ వనరులు ఉన్నా, వాటిని సరిగ్గా వాడుకోవడంలో లోపం ఉంది. పైగా రాజకీయ అస్థిరత కారణంగా ఆర్థిక వ్యవస్థ సరిగా ఎదగలేకపోతోంది. అందుకే వారి కరెన్సీ కూడా బలహీనంగానే ఉంది.