భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో మరో విప్లవాత్మక మార్పు రాబోతోంది. లక్షలాది మంది ప్రతి రోజు ఉపయోగించే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఇప్పుడు కొత్త సాంకేతికతతో ముందుకు అడుగు వేస్తోంది. ఇకపై యూపీఐ ద్వారా చెల్లింపులు చేయాలంటే 4 లేదా 6 అంకెల పిన్‌ను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా, ముఖం లేదా వేలిముద్ర ఆధారంగా లావాదేవీలు పూర్తిచేసుకోవచ్చు. ఈ కొత్త విధానం అక్టోబర్ 8 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుందని ఎకనామిక్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. దీంతో చెల్లింపు ప్రక్రియ వేగవంతం, సులభతరం మాత్రమే కాకుండా భద్రతా పరంగా మరింత బలపడనుంది.
ఈ ప్రాజెక్టు అమలుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సిద్ధమవుతోంది. ముంబైలో జరగనున్న గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో ఈ కొత్త బయోమెట్రిక్ ఫీచర్‌ను NPCI ప్రదర్శించనుంది. నిపుణులు ఈ మార్పును భారత డిజిటల్ ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా చూస్తున్నారు. "ఇకమీదట మీ గుర్తింపే మీ పాస్‌వర్డ్" అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బయోమెట్రిక్ ఆధారిత చెల్లింపులు ప్రారంభమైతే, యూపీఐ వాడకం మరింత విస్తృతమవుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ కొత్త వ్యవస్థ పూర్తిగా భారత ప్రభుత్వ ఆధార్ డేటాబేస్ మీద ఆధారపడి ఉంటుంది. వినియోగదారుడు చెల్లింపును ఆమోదించేటప్పుడు తన ముఖం లేదా వేలిముద్రను ఉపయోగిస్తే, అది ఆధార్‌లో నమోదైన బయోమెట్రిక్ వివరాలతో సరిపోల్చబడుతుంది. ఈ ధృవీకరణ తర్వాతే చెల్లింపు ఆమోదించబడుతుంది. ఈ ప్రక్రియలో పిన్ ఎంటర్ చేయడం అవసరం లేకుండా, ఫోన్ కెమెరా లేదా ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఆటోమేటిక్‌గా సక్రియమవుతుంది. విజయవంతమైన స్కాన్ తర్వాత చెల్లింపు కేవలం కొన్ని సెకన్లలో పూర్తవుతుంది. ఇది ముఖ్యంగా వృద్ధులు, పిన్ గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడేవారికి చాలా సౌలభ్యంగా ఉంటుంది.
ఈ నిర్ణయం వెనుక కారణం RBI తీసుకున్న కొత్త మార్గదర్శకాలు. చెల్లింపు వ్యవస్థల్లో భద్రత, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యామ్నాయ ప్రామాణీకరణ పద్ధతులను అనుమతించింది. డిజిటల్ లావాదేవీలను మరింత యూజర్ ఫ్రెండ్లీగా, సురక్షితంగా మార్చడం RBI ప్రధాన లక్ష్యం. ఈ మార్పుతో భారతదేశం డిజిటల్ చెల్లింపుల్లో మరో ముందడుగు వేసి, గ్లోబల్ ఫిన్‌టెక్ రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరచనుంది.