రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న గల్ఫ్ సంక్షేమ కార్యక్రమాలపై అబద్దాలు ఆడుతున్న హరీష్ రావును గల్ఫ్ కార్మికులు చెప్పుతో కొట్టే పరిస్థితి ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ అనిల్ ఈరవత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో శనివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రెండువేల మంది తెలంగాణ కార్మికులు గల్ఫ్ దేశాలలో చనిపోతే వారికి ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదని, గల్ఫ్ కార్మికుల పాలిట కేసీఆర్ ఒక నరరూప రాక్షసుడని, కేటీఆర్, కవిత, హరీష్ చిన్న రాక్షసులని అనిల్ అన్నారు.
ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఒక్క రూపాయి కేటాయించలేదని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నాడని ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్, అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్ ప్రశ్నించారు. బొగ్గుబాయి - బొంబాయి - దుబాయి అనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో... వలస కార్మికులను రెచ్చగొట్టి వాడుకుని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని వదిలేసి, నట్టేట ముంచిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని కమిటీ సభ్యులు చెన్నమనేని శ్రీనివాస రావు అన్నారు.
గల్ఫ్ కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్, కవిత తో పాటు ఆర్థిక మంత్రులుగా పనిచేసిన ఈటెల రాజేందర్, తన్నీరు హరీష్ రావు లు మాట తప్పారని కమిటీ సభ్యులు నంగి దేవేందర్ రెడ్డి అన్నారు. ఈ అయిదుగురూ ‘గల్ఫ్ ద్రోహులు’ గా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు గల్ఫ్ కార్మికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
గల్ఫ్ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని, ప్రవాసీ ప్రజావాణి ని సందర్శించాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలోని రెండు వేల మంది గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల చొప్పున వంద కోట్ల రూపాయలను బీఆర్ఎస్ పార్టీ నిధుల నుండి చెల్లించి పాపానికి ప్రాయచిత్తం చేసుకోవాలని హితవు పలికారు.
గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు, ఫిర్యాదుల స్వీకరణకు 'ప్రవాసీ ప్రజావాణి' ఏర్పాటు, గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు, సమగ్ర ఎన్నారై పాలసీ రూపకల్పన కొరకు ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేసిన రేవంత్ సర్కార్ 'గల్ఫ్ భరోసా' సంక్షేమ కార్యక్రమాలను జీర్ణించుకోలేక హరీష్ రావు తప్పుడు వాదనను తెరమీదికి తెస్తున్నారని వారన్నారు.