ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతుల అభివృద్ధి వేగం అందుకుంటోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో ప్రధాన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ నగరంలోని వాంబే కాలనీ–మధురానగర్ మధ్య రైల్వే అండర్ బ్రిడ్జి (లిమిటెడ్ హైట్ సబ్‌వే) నిర్మాణానికి కేంద్రం నుంచి ఆమోదం లభించింది. ఈ నిర్ణయం వాంబే కాలనీ ప్రాంత ప్రజలకు ఎంతో ఊరటనిచ్చింది, ఎందుకంటే ఇది వారి దశాబ్దాల నాటి స్వప్నం.
ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రంలో పలు దీర్ఘకాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులకు ఊపిరి వచ్చింది. కేంద్రం సహకారంతో పలు రోడ్డు, రైల్వే ప్రాజెక్టులు మళ్లీ ప్రగతిపథంలోకి వస్తున్నాయి. వాంబే కాలనీ–మధురానగర్ మధ్య రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం కూడా ఆ జాబితాలో చేరింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రాంత ప్రజలకు సురక్షిత రాకపోకలు సాధ్యమవుతాయి.
ప్రస్తుతం వాంబే కాలనీ, అజిత్‌సింగ్ నగర్ ప్రాంతాల ప్రజలు పనుల కోసం నగరంలోకి రావాలంటే రైల్వే ట్రాక్ దాటాల్సి వస్తోంది. ఈ మార్గం ప్రమాదకరంగా ఉండటంతో, ప్రతి రోజూ వేలాది మంది కూలీలు, మహిళలు, పిల్లలు ప్రాణాలను పణంగా పెట్టి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ స్థానికులు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.
ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) చొరవ తీసుకున్నారు. ఎంపీ కేశినేని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కి లేఖ రాసి ఈ ప్రాజెక్టుకు ఆమోదం ఇవ్వాలని కోరారు. దీనిపై మంత్రి స్పందించి, వాంబే కాలనీ–మధురానగర్ మధ్య లిమిటెడ్ హైట్ సబ్‌వే నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆయన ఎంపీకి అధికారిక లేఖ పంపించారు.
ఇప్పటికే రైల్వే శాఖ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్, డ్రాయింగ్ పనులు ప్రారంభించిందని సమాచారం. ఈ అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ భారం తగ్గి, ప్రజల రాకపోకలు సులభమవుతాయి. ఈ వార్తతో వాంబే కాలనీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.