ఇండియాని “డెడ్ ఎకానమీ” అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దిమ్మతిరిగే రీతిలో తిరస్కరించబడుతున్నాయి. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఎంతో దురుద్దేశపూరితంగా, భారత ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోకముందే చేసిన వ్యాఖ్యలుగా అభిప్రాయపడుతున్నారు ఆర్థిక నిపుణులు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికం (Q1)లో భారత దేశ జిడిపి గణనీయమైన 7.8% వృద్ధి నమోదు చేయడం ఈ వ్యాఖ్యలకు సమాధానం చెప్పినట్లైంది.
భారతదేశ ఆర్థిక వ్యవస్థ గతకొన్ని సంవత్సరాలుగా స్థిరంగా, శక్తివంతంగా ఎదుగుతుంది. కరోనా వంటి మహమ్మారి ప్రభావం నుంచి కోలుకుని, వృద్ధి దిశగా అడుగులు వేసిన దేశాలలో భారత్ ముందున్నది. ముఖ్యంగా వ్యవసాయ రంగం, ఫైనాన్షియల్ సర్వీసులు, రియల్ ఎస్టేట్ రంగాలలో ఈ త్రైమాసికంలో గణనీయమైన వృద్ధి కనిపించింది. దీన్ని ప్రపంచ ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ వాణిజ్య సవాళ్ళ మధ్య సాధించడమే విశేషం.
అమెరికా త్రైమాసిక వృద్ధి రేటు ఈ కాలంలో -0.5%గా నమోదవడం, అదే సమయంలో చైనా వృద్ధి రేటు 5.2% ఉండగా, భారత్ 7.8% సాధించడం గర్వకారణం. ఇది భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అంతర్జాతీయ ఒత్తిడులు, వాణిజ్య పరమైన పరిమితులను దాటుకుని ఉన్న స్థిరత్వాన్ని చాటిచెప్పుతుంది.
భారత ఆర్థిక వ్యవస్థ ఎగుమతులపై పూర్తిగా ఆధారపడినది కాదు. దేశీయ వినియోగం, సేవా రంగం, MSME (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్) రంగం వంటి విభాగాలపై ఆధారపడిన విధానం భారత్‌కు మరింత స్థిరతను కల్పిస్తోంది. టారఫ్స ఆంక్షలు భారత ఎకానమీపై పెద్దగా ప్రభావం చూపకపోవడానికి ఇదే ప్రధాన కారణం. అంతేకాకుండా, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్నాయి.
ప్రస్తుతం భారతదేశం గ్లోబల్ సౌత్‌కు నాయకత్వం వహించే స్థాయికి చేరుతోంది. IMF, World Bank వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా భారత వృద్ధి రేటును ప్రశంసిస్తున్నాయి. 2025 చివరికి భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి.
అందువల్ల ట్రంప్ లాంటి నాయకులు భారత ఆర్థిక వ్యవస్థను తక్కువ అంచనా వేయడమే కాకుండా, తమకు తెలియని అంశాలపై వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన వ్యాఖ్యలుగానే కనిపిస్తున్నాయి. వాస్తవానికి భారత్ ఎప్పుడూ "డెడ్ ఎకానమీ" కాదు – ఇది ఒక "రైజింగ్ ఎకానమీ", ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా తలచబడుతున్న దేశం.
ఇక ముందు, ఎవరు ఏమన్నా... గణాంకాలు చెబుతున్న వాస్తవం ఒక్కటే – భారత్ ఆర్థికంగా బలంగా ఉంది, ఇంకా బలపడుతోంది!