వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య దేశవ్యాప్తంగా క్రమంగా పెరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఈ రైళ్లను కొత్త కొత్త మార్గాల్లో ప్రవేశపెట్టి ప్రజలకు మరింత సౌకర్యం కల్పిస్తోంది. ఇప్పటివరకు 150కి పైగా వందే భారత్ రైళ్లు దేశంలోని వేర్వేరు రాష్ట్రాలు, నగరాల మధ్య నడుస్తున్నాయి.
సాధారణ రైళ్లతో పోలిస్తే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆధునిక సదుపాయాలు, వేగవంతమైన ప్రయాణం అందుబాటులో ఉండటంతో ప్రయాణికుల నుంచి వీటికి మంచి స్పందన లభిస్తోంది. పండగ సమయాల్లో టికెట్లు దొరకని పరిస్థితి కనిపిస్తోంది. సాధారణ రైళ్లతో పోలిస్తే టికెట్ ధర కొంత ఎక్కువైనా – త్వరగా గమ్యానికి చేరుకోవడమే కాక, సౌకర్యవంతమైన ప్రయాణం అందించడం వల్ల ప్రజలు ఈ రైళ్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.
సికింద్రాబాద్ – నాగ్‌పూర్ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కూ పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలుకు మరిన్ని స్టేషన్లలో హాల్ట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టు కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి వెల్లడించారు.
ఇకపై నాగ్‌పూర్ – సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సిర్పూర్ కాగజ్ నగర్, మంచిర్యాల్ స్టేషన్లలో కూడా ఆగనుంది. నాగ్‌పూర్ నుంచి తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరే రైలు (20101) మధ్యాహ్నం 12:15కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అదే విధంగా మధ్యాహ్నం 1 గంటకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే రైలు (20102) రాత్రి 8 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది.
ప్రస్తుతం ఈ రైలు సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్లార్షా, రామగుండం, ఖాజీపేట్ లలో ఆగుతుంది. కొత్తగా సిర్పూర్ కాగజ్ నగర్, మంచిర్యాల్ కూడా ఈ జాబితాలో చేరాయి. ఈ హాల్ట్ సౌకర్యం ప్రారంభమైన తర్వాత రోజువారీ ప్రయాణికులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు మరింత సౌకర్యం కలుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.