కువైట్‌లో విద్యా సంవత్సరం సెప్టెంబర్ నుండి జూన్ వరకు ఉంటుంది. సెప్టెంబర్ 16, 2025న విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో, పాఠశాలల చుట్టూ రోడ్లపై రద్దీని పర్యవేక్షించడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన తాత్కాలిక అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అలీ అల్-అద్వానీ స్వయంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. మొదటి ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలను చేపట్టారు.
మేజర్ జనరల్ అల్-అద్వానీ పాఠశాలల చుట్టూ ఉన్న ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ను పరిశీలించారు. రద్దీని తగ్గించడానికి, విద్యార్థులు పాఠశాలకు సులభంగా చేరుకోవడానికి మరియు రహదారి నిబంధనల ఉల్లంఘనలను నివారించడానికి ట్రాఫిక్ భద్రతా చర్యలను కఠినంగా అమలు చేయాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. అదేవిధంగా, తల్లిదండ్రులు, విద్యార్థులు, మరియు ట్రాఫిక్ అధికారులు పూర్తిగా సహకరించాలని, రోడ్డు నిబంధనలను పాటించాలని ఆయన కోరారు.
కువైట్ లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్కూల్ కొనసాగుతుంది.కువైట్‌లో విద్యా విధానంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఉచితం, కానీ ప్రైవేట్ పాఠశాలలు రుసుము వసూలు చేస్తాయి. ఈ రుసుములు సాధారణంగా సంవత్సరానికి 1,000 నుండి 9,000 కువైట్ దినార్ల వరకు ఉంటాయి.
ప్రైవేట్ పాఠశాలల్లో స్విమ్మింగ్ పూల్స్, ఇండోర్ జిమ్స్, మ్యూజిక్ రూమ్స్, సైన్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్‌లు, అలాగే అత్యాధునిక ఆట స్థలాలు ఉంటాయి. కొన్ని పాఠశాలల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, రోబోటిక్స్ ల్యాబ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. గుర్రపు స్వారీ, టెన్నిస్, గోల్ఫ్ వంటి ఖరీదైన క్రీడలలో శిక్షణ కూడా తరచుగా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, సంగీతం, పెయింటింగ్, డ్రామా మరియు ఇతర కళలలో ప్రైవేట్ శిక్షణ తీసుకోవడం కూడా సర్వసాధారణం.
కువైట్‌లో చాలా కుటుంబాలు పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లడానికి, తీసుకురావడానికి వ్యక్తిగత డ్రైవర్లను లేదా ప్రత్యేక వాహనాలను ఉపయోగిస్తాయి. ఇక సెలవుల విషయానికి వస్తే, వేసవి సెలవులు జూలై, ఆగస్టు నెలల్లో ఉంటాయి. అలాగే, శీతాకాలంలో రెండు వారాల పాటు సెలవులు ఇస్తారు.