ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల సన్నాహాల్లో ఓ అద్భుతమైన తప్పిదం వెలుగులోకి వచ్చింది. మహోబా జిల్లా జైత్‌పూర్ గ్రామపంచాయతీ ముసాయిదా ఓటర్ల జాబితాలో ఒకే ఇంటి చిరునామా కింద ఏకంగా 4,271 మంది ఓటర్లు నమోదవ్వడం పెద్ద సంచలనంగా మారింది. ఈ గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య 16,069 కాగా, దాదాపు నాలుగో వంతు ఓటర్లు ఒకే ఇంటికి ట్యాగ్ కావడం స్థానికులను, ప్రజాప్రతినిధులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయాన్ని బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే సందర్భంగా గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సంఘటనపై సహాయ జిల్లా ఎన్నికల అధికారి ఆర్.పీ. విశ్వకర్మ స్పందించారు. ఆయన మాట్లాడుతూ, ఇది ఎటువంటి అక్రమం కాదని, పూర్తిగా సాంకేతిక లోపమేనని స్పష్టం చేశారు. “గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నంబర్ల రికార్డింగ్‌లో స్పష్టత ఉండదు. డేటా ఎంట్రీ సమయంలో మూడు వార్డుల ఓటర్లను పొరపాటున ఒకే చిరునామాకు జోడించారు. ఓటర్లు నిజమైనవారే కానీ వారి చిరునామా తప్పుగా చేరింది. దీనిని వెంటనే సరిదిద్దుతున్నాం” అని వివరించారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కున్వర్ పంకజ్ సింగ్ కూడా 2021లో ఇలాంటి పొరపాట్లు జరిగినట్లు అంగీకరించారు.
ఈ తప్పిదం జైత్‌పూర్‌లోనే కాకుండా సమీపంలోని పన్వారీ పట్టణంలోనూ బయటపడింది. ఒక ఇంటిలో 243 మంది, మరో ఇంటిలో 185 మంది ఓటర్లు నమోదు కావడం అధికారుల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేసింది. ఈ అంశాన్ని మొదటగా గుర్తించిన సామాజిక కార్యకర్త చౌదరి రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, “ఒకే ఇంట్లో వందల మంది ఓటర్లు వేర్వేరు కులాలకు చెందినవారు నమోదు కావడం వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఇది ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనం” అని ఆరోపించారు.
ఇలాంటి సంఘటనలు పదే పదే పునరావృతం కావడం ఎన్నికల పారదర్శకతపై మచ్చ తెస్తుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఓటర్ల జాబితా సరిచూడడంలో అధికారులు నిర్లక్ష్యం చూపడమే కాకుండా ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇక సాధారణ ప్రజలు కూడా ఒకే ఇంటిపై వేలాదిమంది ఓటర్లను నమోదు చేయడం ఎన్నికల ప్రక్రియపై అనుమానాలకు తావిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఇలాంటి లోపాలు తొలగించకపోతే ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు.