భారత రైల్వేలు ప్రయాణికులకు టికెట్ బుకింగ్‌ను మరింత పారదర్శకంగా, సురక్షితంగా చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1, 2025 నుంచి టికెట్ బుకింగ్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా IRCTC అకౌంట్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. ఒకవేళ మీ IRCTC ఖాతా ఆధార్‌తో లింక్ చేయకపోతే, ఆ మొదటి 15 నిమిషాల్లో టిక్కెట్లు పొందడం సాధ్యం కాదు. సాధారణ ప్రయాణికులకు మొదటి అవకాశాన్ని ఇవ్వడానికి, ఏజెంట్ల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ కొత్త నిబంధనను అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
రైల్వే అధికారులు గుర్తించిన సమస్యల ప్రకారం, టికెట్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే ఏజెంట్లు, తప్పుడు వినియోగదారులు పెద్ద సంఖ్యలో సీట్లను బ్లాక్ చేస్తున్నారు. దీని వలన నిజమైన ప్రయాణికులు టిక్కెట్లు పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇకపై ఈ సమస్యను నివారించడానికి ఆధార్ లింక్ తప్పనిసరి చేశారు. ఈ మార్పుతో సాధారణ ప్రయాణికులు మొదటి 15 నిమిషాల వరకు ప్రాధాన్యత పొందుతారు. ఏజెంట్లు మాత్రం 10 నిమిషాల తర్వాతే యాక్సెస్ పొందగలరు. రైల్వే అధికారులు చెబుతున్నట్లుగా, ఈ చర్య వలన టికెట్ బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెరిగి, అసలు ప్రయాణికులకు పెద్ద సహాయం అవుతుంది.
మీ IRCTC ఖాతా ఆధార్‌తో లింక్ అయిందో లేదో తెలుసుకోవడం చాలా సులభం. ముందుగా IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత My Account విభాగానికి వెళ్లి My Profile క్లిక్ చేయాలి. అక్కడ ఆధార్ KYC అనే ఆప్షన్ ఉంటుంది. మీ ఆధార్ ఇప్పటికే లింక్ అయి ఉంటే అక్కడ KYC Verified లేదా Aadhaar Verified అని కనిపిస్తుంది. లింక్ చేయబడకపోతే ఆధార్ నంబర్ ఎంటర్ చేసే అవకాశం వస్తుంది. ఆ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే, మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్‌కు OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసిన వెంటనే మీ IRCTC అకౌంట్ ఆధార్‌తో లింక్ అవుతుంది.
ఈ కొత్త నిబంధనతో టికెట్ బుకింగ్ సిస్టమ్‌లో మార్పు రాబోతోంది. ఇప్పటి వరకు ఏజెంట్లు, మోసగాళ్లు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసి సీట్లు బ్లాక్ చేయడం వల్ల సాధారణ ప్రజలు నష్టపోయేవారు. ఇకపై అలాంటి సమస్యలు తగ్గి, నిజమైన ప్రయాణికులకు టిక్కెట్లు పొందే అవకాశం పెరుగుతుంది. కాబట్టి ప్రయాణించదలచిన ప్రతి ఒక్కరూ అక్టోబర్ 1లోపు తమ IRCTC అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. రైల్వేలు తీసుకున్న ఈ నిర్ణయం పారదర్శకత, న్యాయం, ప్రయాణికుల భద్రతకు పెద్ద మద్దతు ఇస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.