అంజీర్ లేదా అత్తిపండ్లు ఆరోగ్యానికి చాలా మంచివిగా పరిగణించబడతాయి. ఇవి ప్రత్యేకమైన ఆకారంతో, మోదక్‌లా ఉండి తియ్యగా ఉంటాయి. వీటిలో పుష్కలంగా ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి తినడం వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలోకి వస్తాయి, గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి, అలాగే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కొంతమంది వీటిని పండ్లుగా భావిస్తారు, అయితే నిజానికి ఇవి పూల సమూహాలుగా పరిగణించబడతాయి. ఎండబెట్టిన అంజీర్‌లో సహజంగా అధిక చక్కెర ఉంటుంది, కానీ అందులోని ఫైబర్ శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావాన్ని తగ్గిస్తుంది.
ఈ పండ్లలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకంతో బాధపడే వారు ఇవి రెగ్యులర్‌గా తింటే సహజంగానే ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా, వీటిలో ఉండే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. వీటిలో ఉండే ప్రీబయోటిక్ గుణాలు గట్‌లో మంచిబ్యాక్టీరియాను పెంచి ఇమ్యూనిటీని బలపరుస్తాయి. దీని వలన కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి, శరీరానికి సహజంగా శక్తి లభిస్తుంది.
అంజీర్ పండ్లు గుండె ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల అవకాశాలు తగ్గుతాయి. పొటాషియం ఎక్కువగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. అదనంగా కాల్షియం పుష్కలంగా ఉండటం వలన ఎముకలు బలపడతాయి. బోలుగా మారే ఎముకల సమస్య తగ్గుతుంది.
డయాబెటిస్ ఉన్నవారికి కూడా అంజీర్ మంచి సహాయకం. కొన్ని పరిశోధనల ప్రకారం, అంజీర్ ఆకు టీ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇవి ప్రయోజనం కలిగిస్తాయి. హై ఫైబర్ కారణంగా కడుపు ఎక్కువసేపు నిండిన భావన కలిగి, ఆహార పట్ల ఆకలి తగ్గుతుంది. దీంతో బరువు నియంత్రణలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు రోజుకు 2 లేదా 3 పండ్లు తినడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. వీటిని నేరుగా తినవచ్చు, లేదా స్నాక్ టైమ్‌లో, సలాడ్స్‌లో లేదా జామ్ రూపంలో తీసుకోవచ్చు.
చివరగా, అంజీర్ పండ్లు జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మాన్ని కాంతివంతంగా మార్చి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. వీటిలో ఉండే కెరోటినాయిడ్స్, పాలీఫెనాల్స్ శరీరంలో వాపులను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే వీటిని మితంగా తీసుకోవాలి. రోజుకు రెండు లేదా మూడు పండ్లు తినడం సరైన పరిమాణం. ఎక్కువగా తింటే అధిక చక్కెర కారణంగా సమస్యలు రావచ్చు. కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకుని వీటిని ఆహారంలో చేర్చుకోవాలి.