దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు చదివే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తాజాగా 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలకు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థుల అర్హతపై ఇప్పటివరకు అమలైన నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ, కనీస విద్యా పనితీరు మరియు తప్పనిసరి హాజరుపై దృష్టి సారించింది. ఇక నుంచి కనీసం 75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకే బోర్డు పరీక్షలకు హాజరు కావడానికి అనుమతి ఉంటుంది. దీనికి తోడు, రెండు సంవత్సరాలపాటు జరుగుతున్న ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయాలు జాతీయ విద్యా విధానం (NEP-2020) అమలులో భాగంగా తీసుకున్నవని అధికారులు తెలిపారు.
సీబీఎస్సీ బోర్డు ప్రకటనలో ముఖ్యంగా “డమ్మీ విద్యార్థులు” అనే సమస్యను ప్రస్తావించింది. రెగ్యులర్ తరగతులకు హాజరు కాకుండా, కేవలం పరీక్షలకు మాత్రమే నమోదు చేసుకునే విద్యార్థులను ఇకపై పరీక్షలకు అనుమతించరని స్పష్టం చేసింది. అలాగే తగిన సౌకర్యాలు లేకుండా అనుమతి లేని సబ్జెక్టులను అందిస్తున్న పాఠశాలలపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. తొమ్మిదో, పదో తరగతులను కలిపి ఒక ప్రోగ్రామ్‌గా పరిగణించి 10వ తరగతి బోర్డు పరీక్షలు నిర్వహిస్తారు. అదే విధంగా 11వ, 12వ తరగతులను కలిపి ఒక కోర్సుగా పరిగణించి 12వ తరగతి పరీక్షలు జరుగుతాయి. అంటే వరుసగా రెండు సంవత్సరాలు చదవని విద్యార్థులు బోర్డు పరీక్షలకు అర్హులు కారు.

కనీస హాజరు 75 శాతం తప్పనిసరి అయినప్పటికీ, వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు, జాతీయ స్థాయిలో క్రీడలు లేదా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి సందర్భాల్లో 25 శాతం వరకు హాజరు మినహాయింపు కల్పిస్తామని బోర్డు పేర్కొంది. అయితే ఆ సందర్భాల్లో తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంటేషన్ సమర్పించాలి. ఒకవేళ సరైన కారణాలు లేకుండా హాజరు తక్కువగా ఉన్న విద్యార్థులు, రెగ్యులర్ అభ్యర్థులుగా నమోదు చేసుకున్నా కూడా బోర్డు పరీక్షలకు అనర్హులుగా పరిగణిస్తారు. అంతేకాదు, ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో రికార్డులు లేకుండా ఎవరూ బోర్డు ఫలితాలు పొందలేరు. అలాంటి విద్యార్థులు థియరీ పరీక్ష రాసినా “ఎసెన్షియల్ రిపీట్” విభాగంలో ఉంచబడతారు.
పదవ తరగతి విద్యార్థులు తప్పనిసరి ఐదు సబ్జెక్టులతో పాటు మరో రెండు సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. పన్నెండో తరగతి విద్యార్థులకు ఒక అదనపు సబ్జెక్టు ఎంపిక అవకాశం ఉంటుంది. అయితే ఈ సబ్జెక్టులు రెండేళ్ల ప్రోగ్రామ్‌లో తప్పనిసరిగా చదవాలి. ఉపాధ్యాయులు, పాఠశాల అనుమతి లేకుండా ప్రధాన లేదా అదనపు సబ్జెక్టులకు విద్యార్థులు నమోదు చేసుకోలేరు. అదనంగా, గతంలో కంపార్ట్‌మెంట్ లేదా రిపీట్ కేటగిరీలో ఉన్న విద్యార్థులు ప్రైవేట్ అభ్యర్థులుగా మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుంది. సీబీఎస్సీ అమలు చేస్తున్న ఈ నూతన 360-డిగ్రీల విధానం, విద్యార్థులలో క్రమశిక్షణ, నిరంతర అభ్యాసం, మరియు సమగ్ర మూల్యాంకనానికి ప్రాధాన్యత ఇస్తుందని అధికారులు తెలిపారు. ఇది పరీక్షలకే పరిమితమైన విధానం కాకుండా, సంవత్సరం పొడవునా అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.