ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు భారీ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. అక్టోబర్ 2025 నుండి వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌ను కేవలం రూ.100కి చేసే అవకాశం కల్పించింది. గ్రామ సచివాలయాల ద్వారా ఈ రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యేది. ఇప్పుడు సాధారణ ప్రజలకు సులభతరం అయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ, రెవెన్యూ శాఖకు వచ్చే దరఖాస్తుల్లో 70% భూమి హక్కులకే సంబంధించినవని తెలిపారు. అందుకే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌ను గ్రామస్థాయిలో అందుబాటులోకి తెచ్చే చర్యలు తీసుకున్నామని చెప్పారు. రూ.10 లక్షల విలువ కలిగిన భూములైతే రూ.100 ఫీజు, అంతకంటే ఎక్కువ విలువైన భూములకు రూ.1,000 ఫీజుతో రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పించబడుతుందని వెల్లడించారు.
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రానికి రిజిస్ట్రేషన్ల ద్వారా భారీ ఆదాయం వచ్చింది. ఆగస్టు వరకు రూ.4,468.79 కోట్ల ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 30.95% ఎక్కువ. మరోవైపు తెలంగాణ, కర్ణాటకలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి.
ప్రభుత్వం 2027 నాటికి రీసర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తోంది. రీసర్వే పూర్తైన గ్రామాల్లో భూమి సంబంధిత సమస్యలు లేకుండా చూసేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి జియోట్యాగింగ్, క్యూ ఆర్ కోడ్ వంటి పద్ధతులు అమలు చేయనుంది. రెవెన్యూ గ్రామాల పేర్లలో మార్పులు చేయబడతాయి కానీ సర్వే నంబర్లు మాత్రం మార్చబోమని అధికారులు స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో రెవెన్యూ శాఖ సమస్యలే ఎక్కువగా ఉన్నాయని, ఇకపై వాటిని ప్రాధాన్యంగా పరిష్కరిస్తానని అన్నారు. రెండు నెలల్లో ప్రభుత్వ ఫైళ్లు 100% ఆన్‌లైన్‌లోకి మార్చాలని ఆదేశించారు. అలాగే రికార్డుల్లో తప్పులు జరగకుండా బ్లాక్‌చైన్, ఫోరెన్సిక్ ఆడిటింగ్ విధానాలను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఈ సంస్కరణలతో భూమి రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా జరిగి ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.