దక్షిణ మధ్య రైల్వే తిరుపతి మీదుగా ప్రయాణించే ప్రయాణికులకు ఒక ముఖ్యమైన అలర్ట్ ప్రకటించింది. తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఆపరేషన్ల కారణంగా 10 వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్ల టెర్మినల్ స్టేషన్‌ను తాత్కాలికంగా తిరుచానూరుకి మార్చింది. ఈ నిర్ణయం కారణంగా కొన్ని రైళ్ల టైమింగ్స్‌లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. రైల్వే అధికారులు ఈ మార్పులు ఈ నెలలోనే అమల్లోకి వస్తాయని తెలిపారు. కాబట్టి తిరుపతి నుంచి ప్రయాణం చేసే వారు ఈ షెడ్యూల్ మార్పులను ముందుగానే తెలుసుకోవాలని సూచించారు.
ఈ మార్పుల ప్రకారం, జల్నా–తిరుచానూరు ఎక్స్‌ప్రెస్ (07609/07610) అక్టోబర్ 13 నుంచి కొత్త సమయాలతో నడుస్తుంది. జల్నా నుంచి బయలుదేరే రైలు ఉదయం రేణిగుంటకు 9.28కి చేరుకుని, తిరుచానూరుకు 10.45కి చేరుకుంటుంది. తిరుచానూరు నుంచి జల్నాకు బయలుదేరే రైలు మధ్యాహ్నం 3.20కి ప్రారంభమవుతుంది. ఈ మార్పులు తాత్కాలికమైనవే అయినప్పటికీ, ప్రయాణికులకు పెద్దగా ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
అదేవిధంగా చర్లపల్లి–తిరుచానూరు ఎక్స్‌ప్రెస్ (07251/07252) అక్టోబర్ 15 నుంచి కొత్త సమయాలతో నడుస్తుంది. ఈ రైలు ఉదయం 5.58కి రేణిగుంట చేరుకుని, 8 గంటలకు తిరుచానూరుకు చేరుకుంటుంది. తిరుగుముఖంగా తిరుచానూరు నుంచి చర్లపల్లికి వెళ్లే రైలు సాయంత్రం 4.55కి బయలుదేరుతుంది. అలాగే నాందేడ్–తిరుచానూరు ఎక్స్‌ప్రెస్ (07015/07016) రైళ్లు కూడా అక్టోబర్ 11 నుంచి కొత్త టైమింగ్స్‌తో నడుస్తాయి.
ఇక సికింద్రాబాద్–తిరుచానూరు ఎక్స్‌ప్రెస్ (07009/07010) మరియు చర్లపల్లి–తిరుచానూరు ఎక్స్‌ప్రెస్ (07017/07018) రైళ్లకు కూడా మార్పులు చేశారు. ఈ రైళ్లు రేణిగుంట స్టేషన్‌లో కొద్దిసేపు ఆగి, తిరుచానూరుకు వెళ్లనున్నాయి. అయితే ఇతర స్టేషన్లలో ఈ రైళ్ల సమయాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
మొత్తం మీద ఈ నిర్ణయం రైల్వే ఆపరేషన్ల సౌలభ్యం కోసం తీసుకున్నదని అధికారులు తెలిపారు. రైల్వే ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నిర్వహించడం, ప్రయాణికుల రద్దీని తగ్గించడం లక్ష్యంగా ఈ మార్పులు అమలు చేస్తున్నారు. ప్రయాణికులు తమ ప్రయాణ తేదీలకు ముందుగానే షెడ్యూల్‌ను చెక్ చేసుకోవడం మంచిదని రైల్వే శాఖ సూచించింది.