ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే ప్రతి విద్యార్థికి పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు అందించేలా కొత్త పథకాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకానికి ఎలాంటి పరిమితి లేకుండా, ఎంతమంది విద్యార్థులైనా రుణం పొందే అవకాశం కల్పించనున్నారు. దేశంలో ఐఐటీ, ఐఐఎం, నీట్ వంటి ఉన్నత విద్యా సంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులకూ ఈ పథకం వర్తించనుంది. ఈ రుణాలపై ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ, 14 ఏళ్లలో చెల్లించుకునే సౌకర్యం కల్పించనుంది.
సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ మరియు దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రులు, అధికారులతో విద్యా, సంక్షేమ అంశాలపై చర్చించారు. అన్ని హాస్టళ్లను రెసిడెన్షియల్ పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలని, దీని ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలమని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే, హాస్టళ్లలో మౌలిక వసతులు, హైజీన్, ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఏడాదిలోగా మరమ్మతులు పూర్తి చేయాలని, గురుకులాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
బీసీ విద్యార్థులకు ఐఐటీ, నీట్ కోచింగ్ కోసం రెండు ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు. నసనకోట, ఆత్మకూరు బీసీ బాలికల పాఠశాలలను రూ.2.65 కోట్లతో జూనియర్ కాలేజీలుగా ఉన్నతీకరించేందుకు ఆమోదం తెలిపారు. అలాగే “తల్లికి వందనం” పథకం నుంచి స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్‌లకు నిధులు ఇవ్వాలని ప్రకటించారు. అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తి చర్యలు తీసుకోవాలని, దీని ద్వారా విద్యుత్ వ్యయాన్ని తగ్గించవచ్చని చెప్పారు.
సంక్షేమ శాఖలు “వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్” విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. దీని ద్వారా అన్ని వర్గాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని తెలిపారు. రజకులకు గ్యాస్‌తో పనిచేసే ఇస్త్రీ పెట్టెలు, సబ్సిడీ సిలిండర్లు ఇవ్వడం, మత్స్యకార వర్గాలకు సీవీడ్ వంటి నూతన వృత్తులను ప్రోత్సహించడం వంటి అంశాలను పరిశీలించాలని అన్నారు. వెనుకబడిన వర్గాల ఆదాయాన్ని పెంచేందుకు ఆధునీకరణ అవసరమని, ప్రతి కుల వృత్తికి అనుగుణంగా ఆధునిక పనిముట్లు ఇవ్వాలని సూచించారు.
అన్ని వర్గాలకు సమానంగా సంక్షేమ ఫలాలు చేరేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించడంలో ఎలాంటి న్యాయ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. నెల్లూరు, ఏలూరు, కర్నూలు బీసీ భవనాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 64 కులాల కార్పొరేషన్లలో అమలు అవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని, విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సహాయపడుతుందని సీఎం హామీ ఇచ్చారు.