ఆగస్టు 2, 2025న భూమి మొత్తం 6 నిమిషాల పాటు అంధకారంలో మునిగిపోతుందని, ఇది శతాబ్దంలోనే అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణమని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. “గ్రేట్ నార్త్ ఆఫ్రికన్ ఎక్లిప్స్” పేరుతో పిలవబడుతున్న ఈ గ్రహణం అత్యంత భయానకమని కొందరు భావిస్తుండగా, ఖగోళప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఆగస్టు 2, 2025న ఎలాంటి సూర్యగ్రహణం జరగదు. ఎందుకంటే ఆ రోజున అమావాస్య కాదు. సూర్యగ్రహణం ఎప్పుడూ చంద్రుడు, సూర్యుడు ఒకే కక్ష్యలోకి వచ్చే అమావాస్య రోజునే సంభవిస్తుంది. అంతేకాకుండా, నాసా వంటి ఖగోళ సంస్థలు ఈ వార్తను పూర్తిగా తిప్పికొట్టాయి.
ఇప్పుడు ప్రచారంలో ఉన్న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం వాస్తవానికి ఆగస్టు 2, 2027న జరగనుంది. ఇది 6 నిమిషాల 23 సెకన్ల పాటు సాగే గ్రహణం. ఇది ఈ శతాబ్దంలోనే అత్యంత పొడవైన సంపూర్ణ గ్రహణం అవుతుంది. ఈ సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేస్తుంది, దీనివల్ల కొన్ని ప్రదేశాల్లో పట్టపగలే చీకటి కనిపించవచ్చు.
ఈ గ్రహణం ప్రధానంగా ఉత్తర ఆఫ్రికా, యూరప్, మధ్యప్రాచ్యం వంటి ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించనుంది. మొరాకో, ఈజిప్ట్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో మధ్యాహ్న సమయంలో సూర్యుడు పూర్తిగా కప్పబడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆ ప్రాంతాలు పూర్తిగా చీకటిలో మునిగే అవకాశం ఉంది.
భారతదేశంలో ఈ గ్రహణం పాక్షికంగా మాత్రమే కనిపించనుంది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల్లో సాయంత్రం 4:30 నుంచి సూర్యాస్తమయం వరకు పాక్షిక గ్రహణం కనిపించనుంది. ఇది సంపూర్ణ గ్రహణం కాదని ఖగోళ నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు.
సంపూర్ణ సూర్యగ్రహణాలు ఖగోళ పరిశోధనలకు ఎంతో ఉపయోగపడతాయి. గ్రహణ సమయంలో సూర్యుడి వెలుగు తగ్గిపోవడం వల్ల, సూర్యుడి బయటి పొర అయిన కోరోనా అధ్యయనానికి ఇది మంచి అవకాశం. అంతేకాక, కాస్మిక్ రేడియేషన్, సౌర తుఫానులు వంటి అంశాలను విశ్లేషించడానికి ఇదొక అరుదైన సమయం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న “ఆగస్టు 2, 2025 సూర్యగ్రహణం” పుకార్లు పూర్తిగా అవాస్తవం. నాసా, ISRO, TimeandDate.com వంటి ప్రామాణిక ఖగోళ వేదికల ప్రకారం, ఆ రోజున గ్రహణం ఉండదు. నిజమైన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే నమ్మాలి.