పెట్టుబడులు రాబట్టేందుకు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తే తప్పేంటని ఏపీ హైకోర్టు (AP High Court) ప్రశ్నించింది. కంపెనీల రాకతో రాష్ట్రానికి ఎంత ప్రయోజనం కలుగుతుందో చూడాలని సూచించింది. విశాఖలో టీసీఎస్ (ICS)కు భూ కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది.
"రాష్ట్రాభివృద్ధి ప్రారంభ దశలో ఉంది. టీసీఎస్ను ఆకర్షించేందుకు నామమాత్రపు ధరతో ప్రభుత్వం భూమిని కేటాయించి ఉండొచ్చు. ఎంత రేటుతో కేటాయిస్తున్నారనేది కాదు.. ఆ సంస్థ రాకతో రాష్ట్రానికి ఎంత ప్రయోజనం కలుగుతుందో చూడాలి. టీసీఎస్ రూ.1370 కోట్ల పెట్టుబడితో 12వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతోంది. ఐటీ వృద్ధితో హైదరాబాద్, బెంగళూరు ఎలా ఉన్నాయో చూస్తున్నాం కదా” అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
లీజు పద్ధతిలోనే టీసీఎస్ క్కు 21.16 ఎకరాలను భూమిని కేటాయిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎసీపీ) హైకోర్టుకు తెలిపారు. భూమిని విక్రయిస్తున్నామన్న పిటిషనర్ వాదనలో వాస్తవం లేదన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. భూ కేటాయింపులు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని.. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
High Court: 12 వేల ఉద్యోగాలు, ₹1370 కోట్ల.. పెట్టుబడులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!