తూర్పు తీరాన్ని దిశగా దూసుకొస్తున్న మొంథా తుఫాను ప్రభావం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే తీర ప్రాంతాల్లో గాలుల వేగం పెరగడంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యల భాగంగా రైల్వే శాఖ అనేక రైళ్లను రద్దు చేసిన తరువాత, తాజాగా విమానయాన రంగంపై కూడా ఈ తుఫాను ప్రభావం పడింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడుస్తున్న పలు దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను ఎయిర్‌పోర్ట్ అథారిటీ రద్దు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
అక్టోబర్ 28న తుఫాను తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దాంతో భద్రతా కారణాల దృష్ట్యా ఎయిరిండియా పలు విమాన సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇందులో విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు వంటి దేశీయ మార్గాలు మాత్రమే కాకుండా, షార్జా వంటి అంతర్జాతీయ గమ్యస్థానాల సర్వీసులు కూడా ఉన్నాయి. తుఫాను కారణంగా గాలి ఒత్తిడి, దృశ్యపరిధి తగ్గడం వంటి అంశాలు విమాన ప్రయాణ భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఎయిర్‌పోర్ట్ అథారిటీ విడుదల చేసిన రద్దయిన విమానాల జాబితా ప్రకారం – IX 2819 విశాఖపట్నం–విజయవాడ, IX 2862 విజయవాడ–హైదరాబాద్, IX 2875 బెంగళూరు–విజయవాడ, IX 2876 విజయవాడ–బెంగళూరు, IX 976 షార్జా–విజయవాడ, IX 975 విజయవాడ–షార్జా, IX 2743 హైదరాబాద్–విజయవాడ, IX 2743 విజయవాడ–విశాఖపట్నం వంటి సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. దేశీయ రవాణాకు తోడు అంతర్జాతీయ సర్వీసులు కూడా ప్రభావితమవడం ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ సర్వీసులు ఎప్పుడు పునఃప్రారంభమవుతాయనే విషయంపై తుఫాను మార్గం, తీవ్రత ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
ప్రయాణికులు తమ టికెట్ వివరాలు, ప్రత్యామ్నాయ సర్వీసులు లేదా రీఫండ్ వివరాల కోసం ఎయిర్‌లైన్ అధికారిక వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు. ఇదే సమయంలో, రైలు ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఈస్ట్ కోస్ట్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో అనేక రైళ్లు వచ్చే మూడు రోజులపాటు రద్దు చేయబడ్డాయి. వాతావరణ పరిస్థితులను బట్టి తదుపరి షెడ్యూల్ మార్పులు చేపడతామని అధికారులు తెలిపారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వ సూచనలను తప్పక పాటించాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.