ప్రస్తుతం నాలుగు వరుసలతో ఉన్న ఈ రహదారిని తెలంగాణ పరిధిలోని మల్కాపూర్ వద్ద ఉన్న అందోల్ మైసమ్మ ఆలయం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పట్టణంలో ఉన్న కనకదుర్గమ్మ గుడి వరకు 231.32 కిలోమీటర్ల మేర 6 వరుసలుగా విస్తరించనున్నారు.
ఈ విస్తరణ పనులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనను పూర్తిచేసేలా చర్యలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ప్రాథమికంగా తయారైన డీపీఆర్ కాపీ ‘ఆంధ్రజ్యోతి’కి లభించింది. దాని ప్రకారం.. హైదరాబాద్-విజయవాడ రోడ్డు విస్తరణ కోసం దాదాపు రూ.10,391.53 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు.
వీటిలో నిర్మాణ వ్యయం రూ.6,775.47 కోట్లు, వివిధ అవసరాలకు మరో రూ.3,616.06 కోట్లు కావాల్సి ఉందని తేల్చారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి ప్రస్తుతం నాలుగు వరుసలతో ఉంది. ట్రాఫిక్ పెరగడం, విజయవాడ వెళ్లేందుకు ఈ రోడ్డే కీలకం కావడంతో దీని విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విస్తరణతోపాటు రోడ్డును భద్రతా పరంగానూ పటిష్ఠం చేయాలని నిర్ణయించింది.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న పలు జాతీయ రహదారులను డిజిటల్, స్మార్ట్ హైవేలుగా మార్చేలా చర్యలు చేపట్టిన కేంద్రం.. తెలంగాణ పరిధిలోనూ పలు కీలక రహదారులను డిజిటల్, స్మార్ట్ రోడ్లుగా మార్చనుంది. ఇందులో భాగంగానే హైదరాబాద్-విజయవాడ హైవేను కూడా పూర్తిస్థాయిలో స్మార్ట్ రోడ్డుగా మార్చాలని నిర్ణయించింది.
రహదారిపై అత్యంత అధునాతనమెన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానిస్తారు. ఏఐతో అనుసంధానమై ఉన్న కెమెరా వ్యవస్థను రాష్ట్ర పోలీసు, రవాణా శాఖకు అనుసంఽధానం చేస్తారు. ఫలితంగా రహదారిపై నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపిన వివరాలు తెలియడంతోపాటు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయనేది కూడా తెలిసిపోతుంది.
దాంతో రోడ్డుపై వెళ్తున్న ప్రతీ వాహనం వివరాలు తెలియడంతోపాటు ప్రమాదాల నియంత్రణకు ఇది ఉపయోగపడనుంది. ఈ విధానంలో రహదారిపై 360 డిగ్రీల కోణంలో పనిచేసే అత్యాధునిక సీసీ కెమెరాలను ప్రతి కిలోమీటర్‌కు (రెండు వైపులా) ఒకటి చొప్పున 231 కెమెరాలను అమర్చుతారు. ఇవి అత్యంత శక్తిమంతంగా ఉండడంతోపాటు 24 గంటలూ రోడ్లపై నిఘా ఉంచుతాయి.
వీటి పర్యవేక్షణకు ప్రత్యేక మానిటరింగ్ కేంద్రాలను హైవే పైనే ఒకటి, రెండు చోట్ల ఏర్పాటుచేస్తారు. రహదారిపై ఎక్కడైనా ప్రమాదం జరిగితే.. వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు లొకేషన్‌తోపాటు కిలోమీటర్ నంబర్‌తో కూడిన అన్ని వివరాలను సీసీ కెమెరాలు వీడియోతో సహా పంపుతాయి.
స్పీడ్ డిటెక్షన్, రాంగ్ రూట్, ప్రమాదాల వీడియోను చిత్రీకరించడంతోపాటు పలు రకాల సేవలను వీటి ద్వారా అందించనున్నారు. ఫలితంగా రహదారి అత్యంత భద్రతగా ఉండడంతోపాటు ప్రమాదాలు తగ్గేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
దీంతోపాటు రహదారికి ఇరువైపులా అతివేగంతో వెళ్లే వాహనాలు అదుపుతప్పినా రోడ్డుపైనుంచి కిందికి పడిపోకుండా ఉండేలా బారికేడ్లు (ఆర్‌సీసీ క్రాస్ బ్యారియర్స్, మెటల్ బీమ్స్, క్రాష్ బ్యారియర్స్) ఏర్పాటు చేయనున్నారు. దారిలో సోలార్ వీధిదీపాలను కూడా అమర్చనున్నారు. అలాగే వర్షపునీటిని ఒడిసి పట్టేలా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.
ఒక్కసారి రోడ్డు పనులు పూర్తయ్యాక మళ్లీ ఏ ఇతర అవసరాల కోసం రోడ్డును తవ్వకుండా ఉండేలా మంచినీటి సరఫరా, బోరు లైన్లు, హ్యాండ్ పంప్స్, గ్యాస్ పైపులైన్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్లు, హైటెన్షన్ విద్యుత్ లైన్లను అవసరమైన చోట ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించిన 38 చోట్ల ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తుండగా, మరో 17 బ్లాక్‌స్పాట్‌ల వద్ద కూడా రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్‌పా్‌సలు సహా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం మొదటి దశలో భాగంగా హైదరాబాద్-నాగపూర్ మార్గం (ఎన్.హెచ్-44)లో స్మార్ట్ హైవే విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు ఊతమిచ్చేలా హైదరాబాద్- విజయవాడ రహదారిని తీర్చిదిద్దనున్నారు. ఇతర జాతీయ, రాష్ట్ర రహదారులతోపాటు, పలు ఇండస్ట్రియల్ కారిడార్లు, పలు వ్యాపార కేంద్రాలకు దీనిని అనుసంధానం చేయనున్నారు.
దీని ప్రకారం తెలంగాణ నుంచి ఏపీ వరకు కలిపి మార్గం మధ్యలో నుంచి ఇతర రహదారులు, ప్రాంతాల్లో ఉన్న దాదాపు 50 ఇండస్ట్రియల్ పార్కులకు ఈ రహదారి అనుసంధానం కానుంది. అలాగే 20 ఎకనామిక్ నోడ్స్, 4 నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఐసీడీసీ)లకు, రెండు చోట్ల ఉన్న టెక్స్‌టైల్ క్లస్టర్‌లకు, రెండు మేజర్ రైల్వేస్టేషన్లు, రెండు విమానాశ్రయాలకు రహదారి అనుసంధానంగా ఉండనుంది.
తద్వారా వ్యాపార లావాదేవీలు, రవాణా రంగం మరింత బలోపేతమవుతుందని అంచనా వేస్తున్నారు. రహదారి అందుబాటులోకి వచ్చిన తరువాత నుంచి ప్రతిరోజూ లక్షల మందికి వివిధ రంగాలు, పలు రూపాల్లో లబ్ధి చేకూరుతుందని డీపీఆర్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు ప్రయాణ సమయం కూడా తగ్గనుంది.
ప్రస్తుతం ఈ రోడ్డుపై రోజుకు 43,742 వాహనాలు తిరుగుతుండగా.. ఇవి 2035నాటికి 71,251కు చేరుతాయని, అలాగే 2048 నాటికి దాదాపు 1,71,251కి పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. రహదారి విస్తరణ పనులను వచ్చే ఏడాది ఏప్రిల్, మేలో ప్రారంభించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.