International New : ఆసియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం జపాన్ చేరుకున్నారు. టోక్యోలోని ఆకాసాకా ప్యాలెస్‌లో కొత్త ప్రధానమంత్రి సనే తకైచి తో ఆయన భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక అంశాలపై చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఒప్పందంపై సంతకాలు చేశారు. అమెరికా–జపాన్ ఆర్థిక భాగస్వామ్యం మరింత బలపడే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.
భేటీ తర్వాత జపాన్ ప్రధాని సనే తకైచి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ట్రంప్ శాంతి ప్రయత్నాలు గమనార్హమని ఆమె పేర్కొన్నారు. థాయ్‌లాండ్, కంబోడియా మధ్య మీరు సాధించిన శాంతి ఒప్పందం విశేషమైనది. అలాగే గాజా యుద్ధంలో మీరు తీసుకొచ్చిన విరమణ ఒప్పందం ప్రపంచ శాంతి దిశగా కీలక మైలురాయి అని ఆమె అన్నారు.
వైట్‌హౌస్ ప్రకటన ప్రకారం, సనే తకైచి ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడాన్ని సమర్థించనున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయంలో జపాన్ ప్రభుత్వ అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
తనను ప్రెసిడెంట్ ఆఫ్ పీస్ గా పిలుచుకుంటూ వస్తున్న ట్రంప్ గత కొన్నేళ్లలో అనేక దేశాల మధ్య శాంతి చర్చలు విజయవంతం చేశానని చెబుతున్నారు. థాయ్‌లాండ్, కంబోడియా, గాజా, భారత్–పాకిస్థాన్ వంటి ప్రాంతాల్లో తాను శాంతి వాతావరణం తీసుకువచ్చానని ఆయన పేర్కొన్నారు.
ఇజ్రాయెల్, పాకిస్థాన్, కంబోడియా, థాయ్‌లాండ్ వంటి దేశాలు ఇప్పటికే ఆయనను నామినేట్ చేశాయి. ఇప్పుడు జపాన్ కూడా ఆ జాబితాలో చేరే అవకాశం ఉందని వైట్‌హౌస్ తెలిపింది.
ట్రంప్ తన పర్యటనను మలేషియాలోని ఆసియన్ సమ్మిట్‌తో ప్రారంభించారు. అక్కడే థాయ్‌లాండ్–కంబోడియా శాంతి ఒప్పందం కుదిరింది. ఇప్పుడు జపాన్ పర్యటన అనంతరం బుధవారం ఆయన దక్షిణ కొరియా కు బయలుదేరనున్నారు.
సియోల్‌లో జరిగే ఆసియా–పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) సమ్మిట్‌లో పాల్గొనడమే కాకుండా, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం కూడా జరగనుంది. వాణిజ్య సంబంధాలపై ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ట్రంప్ పర్యటనతో ఆసియాలో అమెరికా ప్రభావం కొత్త దశలోకి ప్రవేశించనుందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.