రష్యా తీర ప్రాంతంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. భారీ భూకంపం అనంతరం సునామీ వచ్చే ప్రమాదం ఉందన్న ఊహాగానాలు రేగాయి. అయితే ఈ నేపథ్యంలో భారతదేశానికి ఎలాంటి సునామీ ముప్పు లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) ప్రకారం, భారత సముద్ర భూభాగాలపై భూకంప ప్రభావం ఏ మాత్రం లేదని తెలిపింది.
INCOIS వాతావరణశాఖ, సముద్ర శాస్త్ర నిపుణుల సూచనలతో దేశ వ్యాప్తంగా అలెర్ట్ వ్యవస్థలను పనిచేసేలా చేస్తోంది. తాజా భూకంపానికి సంబంధించి భారత్‌లో ఎలాంటి అలర్ట్ అవసరం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఇదే సమయంలో, అమెరికాలో ఉన్న భారతీయుల కోసం ఇండియన్ (Indian) కాన్సులేట్ జనరల్ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా యూఎస్ తీర ప్రాంతాల సమీపంలో నివసించే భారతీయులు తాత్కాలికంగా అలాంటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారుల సూచనలను పాటించాలని, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో భారత కాన్సులేట్‌ను సంప్రదించాలని సూచించింది.