ఐక్యరాజ్యసమితి (ఐరాస) సర్వసభ్య సమావేశంలో భారత్ పాకిస్థాన్‌ను గట్టిగా నిలదీసింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన “భారత్‌పై యుద్ధంలో గెలిచాం” అన్న వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఎద్దేవా చేసింది. విధ్వంసమైన రన్‌వేలు, కాలిపోయిన హ్యాంగర్లు, ధ్వంసమైన వైమానిక స్థావరాలే విజయానికి సంకేతాలైతే, ఆ విజయాన్ని పాక్ ఆస్వాదించుకోవచ్చని భారత్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. అణు బెదిరింపులకు తలొగ్గేది లేదని, ఉగ్రవాదులను, వారిని ప్రోత్సహిస్తున్న శక్తులను వదిలిపెట్టబోమని స్పష్టం చేసింది.
రైట్ ఆఫ్ రిప్లై’ కింద భారత తరఫున ఫస్ట్ సెక్రటరీ పేతల్ గహ్లోత్ సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదం పాకిస్థాన్ విదేశాంగ విధానంలో భాగమని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. “మే 9 వరకు భారత్‌పై దాడులు కొనసాగిస్తామని పాక్ బెదిరించింది. కానీ మే 10న భారత దాడులతో వారి వైమానిక స్థావరాలు ధ్వంసమైన తర్వాత, కాల్పుల విరమణ కోరుతూ పాక్ మిలిటరీ మమ్మల్ని సంప్రదించింది. ఈ విషయానికి సంబంధించిన ఆధారాలు బహిరంగంగానే ఉన్నాయి” అని గహ్లోత్ తెలిపారు. పాక్ డీజీఎంఓ కాషిఫ్ అబ్దుల్లా, భారత డీజీఎంఓ రాజీవ్ ఘాయ్‌ను నేరుగా ఫోన్ చేసి కాల్పుల విరమణ కోరిన విషయాన్ని ఆమె బయటపెట్టారు.
“ఉగ్రవాదులను, వారిని వెనకనుండి నడిపించే శక్తులను వేరు చేయబోం. ఇద్దరినీ సమానంగా బాధ్యులను చేస్తాం. అణు బ్లాక్‌మెయిల్ కింద ఉగ్రవాదాన్ని కొనసాగించడానికి మేం అనుమతించం. భారత్ ఎప్పటికీ తలొగ్గదు” అని గహ్లోత్ ఘాటుగా అన్నారు. పహల్గామ్‌లో 26 మంది హిందూ, క్రైస్తవ పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి బాధ్యత వహించిన టీఆర్‌ఎఫ్ సంస్థను భద్రతా మండలిలో పాకిస్థాన్ కాపాడేందుకు ప్రయత్నించిందని ఆమె ఆరోపించారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ ఇచ్చే మద్దతు నిరూపితమైందని పేర్కొన్నారు.
భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఉగ్రవాద నిర్మూలనకే పరిమితమని గహ్లోత్ వివరించారు. పాకిస్థాన్ దశాబ్దాలుగా ఉగ్రవాద శిబిరాలను నడుపుతున్నదనే విషయాన్ని వారి మంత్రులే అంగీకరించారని గుర్తు చేశారు. కాల్పుల విరమణలో అమెరికా అధ్యక్షుడి జోక్యం ఉందన్న షరీఫ్ వాదనను ఖండించారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఏ సమస్య ఉన్నా ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటామని, ఇందులో మూడో వ్యక్తి జోక్యానికి తావులేదని స్పష్టం చేశారు. ఈ విధంగా ఐరాస వేదికపై భారత్ పాక్‌కు ఘాటైన హెచ్చరిక జారీ చేసింది.