రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల సౌకర్యాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగింది. ప్రస్తుతం 10 ప్రభుత్వ పాఠశాలలు, 8 పాలిటెక్నిక్ కళాశాలలకు సొంత భవనాలు లేవని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండు పాలిటెక్నిక్ కళాశాలల్లో భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. మిగిలిన వాటిలో చోడవరం, పొన్నూరు, బేతంచర్ల, మైదుకూరు, గుంతకల్లు పాలిటెక్నిక్ కళాశాలలకు భూములు కేటాయించామని, మచిలీపట్నం, కెఆర్ పురం, అనపర్తి కళాశాలలకు ఇంకా భూములు కేటాయించాల్సి ఉందని వివరించారు. కేంద్రంతో చర్చించి, ఎంపి లాడ్స్, సిఎస్ఆర్ నిధులను అనుసంధానించి సొంత భవనాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
నారా లోకేష్ మాట్లాడుతూ కోనసీమ విద్యా రంగంలో వెనుకబడిందని, అందుకే అక్కడ కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేసినట్టు చెప్పారు. త్వరలోనే ఆ కళాశాలను పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అలాగే కోనసీమలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. బ్రహ్మంగారిమఠం మండలంలో మంజూరైన నవోదయ స్కూలును తాత్కాలికంగా ఖాళీ భవనాల్లో ప్రారంభించేందుకు కేంద్ర మంత్రితో మాట్లాడతామని కూడా పేర్కొన్నారు.
ప్రస్తుతం పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్లు 70 శాతం మాత్రమే ఉన్నాయని లోకేష్ తెలిపారు. సాంప్రదాయిక కోర్సులకు విద్యార్థుల ఆసక్తి తగ్గిపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అందుకే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను రూపొందించి, లేటెస్ట్ టెక్నాలజీ ఆధారంగా రీడిజైన్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టి, విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పుట్టా సుధాకర్ యాదవ్, అయితాబత్తుల ఆనందరావు, మద్దిపాటి వెంకటరాజు పలు సూచనలు చేశారు. మైదుకూరు పాలిటెక్నిక్‌లో 540 సీట్లు ఉండగా కేవలం 120 మంది మాత్రమే చదువుతున్నారని, సొంత భవనం ఏర్పడితే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని పుట్టా సుధాకర్ అన్నారు. కోనసీమలో పాలిటెక్నిక్ లేకపోవడంతో విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవలసి వస్తోందని, అక్కడ ప్రభుత్వ కళాశాల ఏర్పాటు అత్యవసరమని ఆనందరావు గుర్తు చేశారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో 94% విజయవంతమైన ఫలితాలు వస్తున్నప్పటికీ అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయని, మరిన్ని విద్యార్థులను ఆకర్షించే చర్యలు తీసుకోవాలని వెంకటరాజు సూచించారు.