ప్రస్తుత కాలంలో బంగారానికి దీటుగా వెండి ధర కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు.ఈ మధ్యకాలంలో వెండి ఆభరణాలపై బంగారం పూత పూయడం ద్వారా అది బంగారపు నగలు వలె ఆకర్షణీయంగా కనిపించడంతో ప్రతి ఒక్కరు బంగారం కొనలేము వెండి రూపంలో ఉన్న నగలు తీసుకోవడం ద్వారా చూడ్డానికి నగల అదేవిధంగా భావితరాల్లో వెండి కూడా రేటు పెరుగుతుందని ఆశతో వెండి పై మక్కువ చూపిస్తున్నారు నేటి మహిళలు.
అయితే సాధారణ వెండి అంటే చాలామందికి మొదట గుర్తుకు వచ్చేది ఆభరణాలే. కానీ నిజానికి ఇది ఆధునిక పరిశ్రమల్లో అత్యంత కీలకమైన లోహం. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్లు, వైద్య పరికరాలు వంటి రంగాల్లో వెండి విస్తృతంగా వాడుతున్నారు. ఈ కారణంగా వెండి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే సరఫరా మాత్రం డిమాండ్‌కు తగ్గట్టు లేకపోవడం గమనార్హం.
ప్రపంచంలో వెండి ఎక్కువగా మెక్సికోలో ఉత్పత్తి అవుతోంది. అక్కడే దాదాపు నాలుగింట ఒక వంతు వెండి త్రవ్వకాల ద్వారా వస్తుంది. మెక్సికో ప్రతి సంవత్సరం 202 మిలియన్ ఔన్సుల వెండి ఉత్పత్తి చేస్తోంది. దాంతో ఇది అగ్రస్థానాన్ని దక్కించుకుని అంతర్జాతీయ మార్కెట్‌లో కీలక పాత్ర పోషిస్తోంది.
రెండవ స్థానంలో చైనా ఉంది. చైనాలో వెండి నేరుగా గనుల నుండి మాత్రమే కాకుండా, రాగి, బంగారం వంటి ఇతర లోహాలను తవ్వే సమయంలో కూడా ఉత్పత్తిగా వస్తుంది. అంతేకాకుండా, చైనాలో అంతర్గత వినియోగం కూడా చాలా ఎక్కువ. అందువల్ల అక్కడి వెండి ఉత్పత్తి దేశీయ అవసరాలకు కూడా పెద్ద స్థాయిలో వినియోగించబడుతోంది.
మూడో స్థానంలో పెరూ ఉంది. పెరూ గనులు ప్రధానంగా రాగి త్రవ్వకాలపై ఆధారపడి ఉంటాయి. ఆ ప్రక్రియలో భారీగా వెండి కూడా లభిస్తోంది. నిపుణుల అంచనాల ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక వెండి నిల్వలు పెరూ దగ్గర ఉన్నాయట. దీనివల్ల పెరూ అంతర్జాతీయ వెండి సరఫరాలో ముఖ్యమైన దేశంగా నిలిచింది.
చిలీ, బొలీవియా, పోలాండ్, రష్యా, ఆస్ట్రేలియా, అమెరికా, అర్జెంటీనా వంటి దేశాలు కూడా వెండి త్రవ్వకాల్లో ముందంజలో ఉన్నాయి. ఈ పది దేశాలు కలిపి ప్రపంచ వెండి మార్కెట్‌ను నడిపిస్తున్నాయి. మొత్తం మీద వెండి ఇప్పుడు ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసే లోహంగా మారింది.
భారత్ ప్రపంచ వెండి ఉత్పత్తిలో 11వ స్థానంలో ఉంది. ముఖ్యంగా Hindustan Zinc సంస్థ కారణంగా భారత్ ఈ రంగంలో వేగంగా ఎదుగుతోంది. 2024 నాటికి ఈ సంస్థ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద వెండి ఉత్పత్తిదారుగా గుర్తింపు పొందింది. అయితే నిపుణుల సైతం వెండిపై పెట్టుబడి పెట్టడం ద్వారా రాబోయే కాలంలో అదొక సంపదగా కూడా చెబుతున్నారు.