దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ (GST) రేట్లు సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. శరన్నవరాత్రి ప్రారంభమైన ఈ రోజునే కొత్త రేట్లు కూడా అమలులోకి రావడం వినియోగదారులకు నిజంగా గుడ్ న్యూస్‌గా మారింది. రోజువారీగా ఉపయోగించే షాంపూలు, సబ్బులు, బేబీ ఉత్పత్తులు, జీవిత బీమా, ఆరోగ్య బీమా వంటి అనేక అవసరమైన వస్తువులు, సేవలు చౌకగా మారాయి. జీఎస్టీ రేటు తగ్గింపు ద్వారా సాధారణ ప్రజల జీవనవ్యయం కొంత వరకు తగ్గనుందని అధికారులు చెబుతున్నారు. ఈ సంస్కరణలతో దేశవ్యాప్తంగా పన్నుల అమలులో ఏకరీతి రాబోతోంది.
కొత్త జీఎస్టీ అమలులో ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే లేదా తగ్గించిన రేట్లను వ్యాపారులు అమలు చేయకపోతే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ వెబ్‌సైట్ https://consumerhelpline.gov.in లో ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం (IGRAM)లో ‘GST సంబంధిత ఫిర్యాదులు’ అనే ప్రత్యేక కేటగిరీని జోడించారు. ఆటోమొబైల్, బ్యాంకింగ్, FMCG, ఇ-కామర్స్ వంటి అనేక రంగాల కోసం ప్రత్యేక ఉపవర్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఫిర్యాదులను దాఖలు చేయడానికి కేవలం పోర్టల్ మాత్రమే కాదు, టోల్-ఫ్రీ నంబర్ 1915, NCH యాప్, WhatsApp, SMS, ఇమెయిల్, ఉమాంగ్ యాప్ వంటి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా హిందీ, ఇంగ్లీష్, తమిళం, బెంగాలీ, గుజరాతీ, అస్సామీతో సహా 17 ప్రాంతీయ భాషల్లో సేవలు లభ్యమవుతాయి. ఫిర్యాదు నమోదు చేసిన వెంటనే వినియోగదారుడు ఒక డాకెట్ నంబర్ పొందుతారు. దీని ద్వారా ఫిర్యాదు పరిష్కారం ఎటువంటి దశలో ఉందో ట్రాక్ చేసుకోవచ్చు. సంబంధిత డేటాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC)తో పాటు కంపెనీలు, ఇతర నియంత్రణ సంస్థలకు షేర్ చేసి, త్వరితగతిన పరిష్కారం అందించనున్నారు.
జీఎస్టీ రేటు తగ్గింపు వాస్తవంగా ప్రజలకు లాభం కలిగిస్తుందో లేదో తెలుసుకోవడానికి మరో కొత్త పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. http://savingwithgst.in అనే ఈ సైట్‌లో జీఎస్టీ అమలుకు ముందు, తరువాత ధరలను పోల్చుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏ వస్తువుపై ఎంత ఆదా అవుతోందో స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇందులో ఆహార పదార్థాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, స్నాక్స్ వంటి అనేక విభాగాలను కూడా జోడించారు. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ఫిర్యాదు పోర్టల్, ధరల పోలిక పోర్టల్‌తో జీఎస్టీ సంస్కరణలు మరింత పారదర్శకంగా మారి, వినియోగదారుల ప్రయోజనాలు కాపాడబడతాయి.