ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో జరిగిన 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాలనలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. సాంకేతికత ద్వారా పాలన ప్రజలకు మరింత చేరువ అవుతుందని, ప్రభుత్వ సేవలు వేగంగా అందించగలమని తెలిపారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతికతలు ప్రభుత్వ శాఖల పనితీరును సమర్థవంతంగా మార్చుతున్నాయని అన్నారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గతంలో ఉమ్మడి ఏపీలోనే ఈ-సేవ, మీ-సేవల ద్వారా ప్రజలకు పౌరసేవలు దగ్గర చేయగలిగామని గుర్తుచేశారు. ఈ-ఫైల్స్, ఈ-కేబినెట్ వంటి పద్ధతులు నిర్ణయాలు వేగంగా తీసుకోవడంలో ఎంతగానో దోహదం చేశాయని వివరించారు. అదే సమయంలో సైబర్ సెక్యూరిటీ కూడా అత్యంత కీలకమని, ఈ వ్యవస్థల విశ్వసనీయతను కాపాడుకోవాలని సూచించారు. ప్రస్తుతం "మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్" ద్వారా 751 పౌరసేవలు నేరుగా మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజలకు చేరుతున్నాయి అని ముఖ్యమంత్రి చెప్పారు.
డిజిటల్ విప్లవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. దీనికి ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి అంతర్జాతీయ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్ సేవలు ప్రభుత్వాలు, విద్య, వైద్య రంగాలకు దోహదం చేస్తాయని, పరికరాల తయారీ పరిశ్రమలు కూడా పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని వివరించారు. దీని ఫలితంగా ఉద్యోగాలు, ఉత్పాదకత, టెక్నాలజీ రంగంలో రాష్ట్రానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని అన్నారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఏపీలో వైద్య రంగాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేసేందుకు సంజీవని ప్రాజెక్టు అమలు చేస్తున్నామని చెప్పారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తున్నామని, త్వరలో ఈ విధానం దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించాలని సూచించారు. అదనంగా, సెమీకండక్టర్ పరిశ్రమను ఏపీకి కేటాయించడంపై ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.
భవిష్యత్తులో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్ సిటీ, మెడ్‌టెక్ పార్క్‌ల ద్వారా ఆంధ్రప్రదేశ్ జాతీయ అభివృద్ధిలో కీలక భాగస్వామిగా మారుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో "డిజిటల్ ఏపీ" సంచికను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఎస్ కె.విజయానంద్, కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.