వారాంతపు సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు దర్శనం కోసం సుమారు 24 గంటల సమయం పడుతోంది.
క్యూ కాంప్లెక్సులు పూర్తిగా నిండిపోవడంతో, భక్తులను ఆక్టోపస్ భవనం నుంచి క్యూ లైన్లలోకి అనుమతిస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తితిదే సిబ్బంది నిరంతరాయంగా అన్నప్రసాదాలు, నీరు, పాలు అందిస్తున్నారు.
ఇక, తిరుమలలో కొత్తగా నిర్మించిన 'పద్మావతి సదనం' విశ్రాంతి భవనాన్ని తితిదే ఛైర్మన్ బి.ఆర్. నాయుడు శుక్రవారం ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి పూజలు నిర్వహించిన ఆయనతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, దాత మైత్రి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఈ విశ్రాంతి భవనం, తితిదే కాటేజ్ డోనర్ స్కీం కింద, విశాఖకు చెందిన మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించింది. ప్రారంభోత్సవం సందర్భంగా దాతను ఛైర్మన్ బి.ఆర్. నాయుడు అభినందించారు.