దేశ విమానయాన రంగం గత దశాబ్దంలోనే విప్లవాత్మక మార్పులను చవిచూసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. 2014లో కేవలం 11 కోట్ల మంది మాత్రమే విమానయాన సేవలను వినియోగించగా, 2025 నాటికి ప్రయాణికుల సంఖ్య 25 కోట్లకు పెరగడం ఈ రంగం సాధించిన అద్భుత పురోగతికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇది దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఒకటిగా విమానయానాన్ని నిలబెట్టిందని ఆయన స్పష్టం చేశారు.
యూపీలోని ఘజియాబాద్‌లోని హిండన్ విమానాశ్రయం వద్ద నిర్వహించిన 'యాత్రి సేవా దివస్ 2025' కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ప్రపంచ స్థాయి సేవలు అందించడం, ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, సురక్షితంగా మార్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. "గత 11 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి ‘ప్రధాన సేవకుడిగా’ పాలన స్వరూపాన్నే మార్చేశారు. ప్రజాసేవకే ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన స్ఫూర్తితోనే మేము ప్రతి ఒక్క విమాన ప్రయాణికుడిని మా ప్రాధాన్యతగా చూస్తున్నాం" అని రామ్మోహన్ నాయుడు అన్నారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో విమానయానం కేవలం ఉన్నత వర్గాలకే పరిమితం కాకుండా, సామాన్య ప్రజలకు కూడా చేరువైందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా 'ఉడాన్' వంటి పథకాల ద్వారా విమాన టిక్కెట్లు చౌకగా లభించడం, చిన్న పట్టణాలు కూడా విమాన కనెక్టివిటీ పొందడం ప్రజలకు సౌలభ్యాన్ని కలిగించిందని తెలిపారు. ఉదాహరణగా హిండన్ విమానాశ్రయాన్ని ప్రస్తావిస్తూ, 2020లో కేవలం ఒకే ఒక విమాన సర్వీసు నడిచిన ఈ విమానాశ్రయం నుంచి ఇప్పుడు దేశంలోని 16 నగరాలకు నేరుగా విమాన సర్వీసులు లభిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఇది కేంద్రం తీసుకొచ్చిన విధానాల ఫలితమని ఆయన అన్నారు.
దేశ విమానయాన రంగం మరింత ఆధునికత దిశగా వెళ్తోందని మంత్రి పేర్కొన్నారు. 'డిజిటల్ ఇండియా మిషన్'లో భాగంగా త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో వైఫై సౌకర్యం అందుబాటులోకి రాబోతోందని ప్రకటించారు. అంతేకాక, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడమే ప్రధాన ధ్యేయమని, విమానయాన రంగంలో ఉన్న భాగస్వాములందరూ స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలనే పిలుపునిచ్చారు. ప్రపంచస్థాయి సదుపాయాలతో ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడం ద్వారా భారత విమానయాన రంగం మరింత శక్తివంతంగా ముందుకు సాగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.