బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రస్తుతం ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే రెండో వారంలోకి ప్రవేశించింది. మొదటి వారం ముగిసిన తరువాత శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటకు వెళ్లింది. ప్రస్తుతం ఇంట్లో 14 మంది కంటెస్టెంట్స్ మిగిలి ఉన్నారు. రెండో వారానికి 7 మంది సభ్యులు నామినేషన్లలో నిలవడంతో ఎలిమినేషన్‌పై ఉత్కంఠ పెరిగింది.

ఆన్‌లైన్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అభిమానులు తమ ఇష్టమైన కంటెస్టెంట్లను కాపాడుకునేందుకు పెద్ద సంఖ్యలో ఓటింగ్ చేస్తున్నారు. ఈ వారంలో ఎక్కువగా సెలబ్రిటీలు నామినేట్ కావడంతో ఓటింగ్‌లో హీటు మరింత పెరిగింది. సెప్టెంబర్ 17 రాత్రి 9 గంటల వరకు వచ్చిన ఫలితాలు ఈసారి ఓటింగ్‌లో పెద్ద ట్విస్ట్‌ని చూపిస్తున్నాయి.
ఓటింగ్‌లో ప్రస్తుతం కమెడియన్ సుమన్ శెట్టి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు అతనికి 41 శాతం ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో సీరియల్ నటుడు భరణి 26 శాతం ఓట్లతో నిలిచాడు. ఇక మూడో స్థానంలో మాస్క్ మ్యాన్ హరీశ్ (8%), నాలుగో స్థానంలో డీమాన్ పవన్ (7.5%), ఐదో స్థానంలో ఫ్లోరా శెట్టి (6%), ఆరో స్థానంలో ప్రియా శెట్టి (5%) నిలిచారు. మనీశ్ మర్యాద మాత్రం కేవలం 3 శాతం ఓట్లు మాత్రమే పొంది చివర్లో ఉన్నాడు.
ఈ ఫలితాల ప్రకారం ప్రియా శెట్టి మరియు మనీశ్ మర్యాద డేంజర్ జోన్ లో ఉన్నారు. అంతేకాకుండా ఫ్లోరా శెట్టి కూడా తక్కువ ఓట్లు పొందడంతో ఆమె పరిస్థితి కూడా క్లిష్టంగానే ఉంది. గత వారం ఎలిమినేషన్ నుండి త్రుటిలో తప్పించుకున్న ఫ్లోరా ఈసారి సురక్షితంగా బయటపడతారా అనే అనుమానాలు ఉన్నాయి.
అయితే ఇంకా ఓటింగ్‌కు రెండు రోజుల సమయం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఫలితాల్లో మార్పులు రావచ్చు. అభిమానుల మద్దతు పెరిగితే డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లు బయటపడే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్ కొనసాగితే మనీశ్ మర్యాద ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వీకెండ్ ఎపిసోడ్ మరింత రసవత్తరంగా ఉండబోతోంది.