భారతీయ రైల్వే తన ఉద్యోగులు, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసిన రైల్వే, ఇప్పుడు తన సిబ్బంది భద్రతకూ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఈ క్రమంలో రైల్వే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో (SBI) ఒక ప్రధాన అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం రైల్వే ఉద్యోగుల జీవిత భద్రతను మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఈ ఒప్పందం ప్రకారం, ఎస్బీఐలో శాలరీ ఖాతాలు కలిగిన రైల్వే ఉద్యోగులు ఇకపై ప్రమాద మరణ భీమా కవరేజ్ పొందనున్నారు. ఒక్కో ఉద్యోగికి గరిష్ఠంగా ఒక కోటి రూపాయల వరకు ప్రమాద మరణ బీమా వర్తిస్తుంది. అంతేకాకుండా, సహజ మరణం సంభవించినప్పుడు పది లక్షల రూపాయల బీమా కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఈ సౌకర్యం కోసం ఉద్యోగులు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా, వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఉండడం ప్రత్యేకతగా నిలుస్తోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు ఏడు లక్షల మంది రైల్వే ఉద్యోగులు ఎస్బీఐ ద్వారా జీతాలు పొందుతున్నారు. ఈ ఒప్పందం వల్ల ఆ ఉద్యోగులందరికీ ఈ బీమా ప్రయోజనాలు స్వయంచాలకంగా వర్తిస్తాయి. అంటే, ఇది ఉద్యోగులపై అదనపు ఆర్థిక భారాన్ని మోపకుండా, వారికి మరియు వారి కుటుంబాలకు భరోసా కలిగించే విధంగా రూపుదిద్దుకుంది. ఇది రైల్వే శ్రామిక శక్తికి ఒక పెద్ద ఉత్సాహాన్ని కలిగించనుంది.
ఇక ప్రమాద భీమా మాత్రమే కాకుండా, ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా మరికొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా 1.60 కోట్ల రూపాయల విమాన ప్రమాద మరణ కవరేజ్ ఉంది. రైల్వేలోని ఫ్రంట్‌లైన్ సిబ్బంది తరచుగా ప్రమాద పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి సమయంలో ఈ భీమా వారికి, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందిస్తుంది. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ ప్రయోజనాలు ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని పెంపొందించి, వారు మరింత ధైర్యంగా తమ విధులను నిర్వర్తించడానికి దోహదం చేస్తాయి.
మొత్తానికి, భారతీయ రైల్వే ఎస్బీఐతో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ఉద్యోగుల జీవిత భద్రతకు ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. శ్రామిక శక్తి రైల్వేకు వెన్నెముక అని గుర్తించిన రైల్వే శాఖ, వారికి ఆర్థిక భరోసా కలిగించే ఈ బీమా పథకాన్ని అందించడం ద్వారా మానవీయ కోణాన్ని ముందుకు తెచ్చింది. ఉద్యోగుల సంక్షేమానికి తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో రైల్వేలో పనిచేస్తున్న లక్షలాది కుటుంబాలకు ఒక ఆశాకిరణంగా నిలవనుంది.