భారత రక్షణ వ్యవస్థను మరింత బలపర్చేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రపంచంలోనే అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థగా పేరొందిన ఎస్-400 ట్రయంఫ్‌ను అదనంగా కొనుగోలు చేయడానికి రష్యాతో భారత్ చర్చలు ప్రారంభించింది. ఈ విషయాన్ని రష్యా రక్షణ రంగానికి చెందిన ఉన్నత అధికారి ధ్రువీకరించారు. ప్రస్తుతం భారత్ వద్ద ఇప్పటికే ఎస్-400 వ్యవస్థలు ఉన్నప్పటికీ, మరిన్ని యూనిట్ల కోసం చర్చలు జరుగుతున్నాయని రష్యా సైనిక-సాంకేతిక సహకార సంస్థ అధిపతి దిమిత్రి షుగేవ్ తెలిపారు.
చైనా నుంచి పెరుగుతున్న ముప్పు నేపథ్యంలోనే భారత్, రష్యాలు 2018లో 5.5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం ఐదు ఎస్-400 యూనిట్లు రావాల్సి ఉన్నప్పటికీ సరఫరాలో ఆలస్యం జరిగింది. చివరి రెండు యూనిట్లు 2026–27 నాటికి అందుతాయని అంచనా. ఈ పరిస్థితిలో అదనపు యూనిట్లపై కొత్త చర్చలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల మేలో పాకిస్థాన్‌పై జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’లో ఎస్-400 వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. శత్రు దేశం నుంచి వచ్చిన క్షిపణులను గాల్లోనే అడ్డుకొని విజయవంతంగా ధ్వంసం చేసింది. ఈ ప్రదర్శన కారణంగానే భారత్ కొత్త యూనిట్లపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అమెరికా ఒత్తిడులకు లొంగకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నందుకు భారత్‌ను రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ ప్రశంసించారు. ఆయుధాల కొనుగోళ్లలో భారత్ ఫ్రాన్స్, ఇజ్రాయెల్‌లను కూడా ఆశ్రయిస్తున్నప్పటికీ, రష్యా ఇప్పటికీ ప్రధాన సరఫరాదారుగానే కొనసాగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.