ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ అకడమిక్ డిపాజిటరీ–అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ABC) ప్లాట్‌ఫాంలో విద్యా రికార్డులు అప్‌లోడ్ చేసేందుకు ఇచ్చిన గడువును పొడిగించింది. ఈ గడువు ఇకపై నవంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. దీని వల్ల విద్యార్థులకు సౌలభ్యం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా విద్యార్థులు తమ సర్టిఫికెట్లు, క్రెడిట్ పాయింట్లు భద్రంగా నిల్వ చేసుకోవచ్చు. అవసరమైతే ఒక విద్యాసంస్థ నుంచి మరొకదానికి ఈ రికార్డులను సులభంగా బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో విద్యార్థుల విద్యా వివరాలు సురక్షితంగా ఉండటంతో పాటు, భవిష్యత్‌లో అవసరమైనప్పుడు సులభంగా ఉపయోగించుకోవచ్చు.
ఇక విద్యార్థులు, విద్యాసంస్థలలో అవగాహన పెంచేందుకు ఇప్పటికే మూడు వర్క్‌షాప్‌లు నిర్వహించామని విద్యామండలి ఛైర్మన్ మధుమూర్తి తెలిపారు. అలాగే అన్ని యూనివర్శిటీలు, కాలేజీల నోడల్ అధికారులు ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ నిర్ణయంతో విద్యార్థుల భవిష్యత్‌కు మరింత భద్రత కలుగుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు.