కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి దారితీశాయి. దావణగెరె జిల్లా ఎస్పీ ఉమా ప్రశాంత్‌పై హరిహర ఎమ్మెల్యే బి.పి. హరీశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె కాంగ్రెస్ నేతల ఇంటి వద్ద ‘పెంపుడు కుక్క’లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో ఆగ్రహించిన ఎస్పీ స్వయంగా ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.
దావణగెరెలో రిపోర్టర్స్ గిల్డ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్ మాట్లాడుతూ.. "నేను ఎమ్మెల్యేనైనా, ఎస్పీ నన్ను చూసినా ముఖం చిట్లిస్తారు. కానీ కాంగ్రెస్ శమనూరు కుటుంబం కోసం మాత్రం గేటు వద్ద కాపలా కాస్తారు. వాళ్లింట్లోని పోమరేనియన్ కుక్కలా ప్రవర్తిస్తున్నారు" అని అన్నారు. కాంగ్రెస్ నేత శివశంకరప్ప, ఆయన కుమారుడు మల్లికార్జున్ మంత్రి, కోడలు ప్రభా ఎంపీగా ఉన్నారని గుర్తు చేశారు.
ఇక ఇటీవలే మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.వి. దేశ్‌పాండే కూడా ఓ మహిళా రిపోర్టర్‌తో అనుచితంగా ప్రవర్తించిన ఘటన బయటపడింది. వరుసగా మహిళలపై రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలు, ప్రవర్తనపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలను గౌరవించని ఈ ధోరణిపై సమాజంలోని అన్ని వర్గాల నుంచి వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి.