ఆంధ్రప్రదేశ్‌లో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను చౌక ధరలకు అందించేందుకు రేషన్ దుకాణాలు ప్రధాన భూమిక వహిస్తున్నాయి. బియ్యం, పంచదార, గోధుమపిండి, రాగులు, వంట నూనె వంటి వస్తువులను ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సరఫరా చేస్తోంది. అయితే, గత కొన్నిరోజులుగా రేషన్ కార్డుదారులు ఎదురుచూస్తున్న కందిపప్పు మాత్రం దుకాణాల్లో అందుబాటులో లేకపోవడం నిరాశ కలిగిస్తోంది. వైసీపీ హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా సరుకులు పంపిణీ చేసినప్పటికీ, ఇప్పుడు డీలర్ల ద్వారానే సరఫరా కొనసాగుతోంది.
సెప్టెంబర్ నెలలో కూడా రేషన్ దుకాణాల్లో కందిపప్పు రాకపోవడంతో కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దికాలం పాటు కందిపప్పును సరఫరా చేసినా.. ప్రస్తుతం పూర్తిగా నిలిపివేశారు. పౌరసరఫరాల సంస్థ నుంచి జిల్లాలకు కేటాయింపులు లేకపోవడంతో, డీలర్లు బియ్యానికే మాత్రమే డీడీలు కడుతున్నారు. దీంతో దుకాణాల్లో కందిపప్పు కోసం వెతికినా దొరకని పరిస్థితి ఏర్పడింది.
ఇక బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర కిలోకు రూ.120 నుంచి రూ.140 వరకూ ఉండటంతో పేద ప్రజలకు అది మరింత భారంగా మారింది. గతంలో రేషన్ షాపుల్లో ప్రభుత్వం కేవలం రూ.67కే అందించిన కందిపప్పు ఇప్పుడు రెట్టింపు ధరకు కొనాల్సి వస్తోందని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కందిపప్పు సరఫరాను పునరుద్ధరించి, రాయితీ ధరలకు అందించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.