ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన సృష్టించిన సుగాలి ప్రీతి కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే సంబంధిత అధికారులకు లేఖ రాయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి సారించి, CID అధికారులకు వేగంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు.
సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ పోరాటం చాలా కాలంగా కొనసాగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన కర్నూలుకు వెళ్లి ప్రీతి కుటుంబాన్ని పరామర్శించారు. వైసీపీ ప్రభుత్వం కాలంలో కూడా పవన్ ఒత్తిడితో కేసును సీబీఐకి అప్పగించారు. కానీ అప్పటికే సాక్ష్యాధారాలు నాశనం అయ్యాయని అధికారులు గుర్తించారు. దీంతో కూటమి ప్రభుత్వం మరోసారి సీబీఐ విచారణకు అప్పగిస్తూ, కేసును సీరియస్‌గా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది.
తాజాగా పవన్ కళ్యాణ్ ఈ కేసుపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాను చేసిన పోరాటాన్ని ప్రీతి తల్లి మరిచిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసిన తననే విమర్శించడం సరైంది కాదని ప్రశ్నించారు. గత ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని సమయంలో, ప్రీతి కుటుంబం బాధను చూసి జనసేన పోరాటం చేసిన విషయం ఆయన గుర్తు చేశారు. అదే పోరాటం కారణంగా కేసు సీబీఐ దర్యాప్తుకు వెళ్లిందని పవన్ తెలిపారు.
జనసేన పార్టీ పోరాటం వల్లే సుగాలి ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం ఆస్తులు, సాయం కల్పించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కుటుంబానికి దిన్నెదేవరపాడులో ఐదు ఎకరాల పొలం, కర్నూలులో ఐదు సెంట్ల స్థలం, అలాగే ప్రీతి తండ్రికి ఉద్యోగం వచ్చిందని ఆయన వివరించారు. ఇవన్నీ పార్టీ కృషి ఫలితమని గుర్తుచేశారు.
2017 ఆగస్టు 18న కర్నూలు జిల్లాలోని పాఠశాల వసతి గృహంలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ సుగాలి ప్రీతి మృతదేహం లభించింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. వైసీపీ హయాంలో కేసును సీబీఐకి అప్పగించినా దర్యాప్తు పెద్దగా ముందుకు సాగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరోసారి కేసును సీబీఐకి అప్పగించడం ద్వారా కుటుంబానికి న్యాయం చేయాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో, ప్రజల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.