ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఆధ్వర్యంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO), ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) పోస్టుల నియామకానికి సంబంధించి ప్రిలిమినరీ రాత పరీక్షలు సెప్టెంబర్ 7న జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో ఆఫ్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజా బాబు వెల్లడించారు.
మొత్తం 691 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన ఈ పరీక్షలకు భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. అందులో FBO, ABO పోస్టులకు 1,17,958 మంది, FSO పోస్టులకు 19,568 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వీరందరికీ 13 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించి, హాల్ టికెట్లు ఇప్పటికే జారీ చేసినట్లు తెలిపారు.
అభ్యర్థులు పరీక్షలో OMR షీట్లు నింపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. బ్లూ లేదా బ్లాక్ బాల్‌పెన్‌తో మాత్రమే బబ్లింగ్ చేయాలని సూచించారు. చిన్న చిన్న తప్పుల వలన OMR షీట్ ఇన్వాలిడ్ అయ్యే ప్రమాదం ఉందని, వైట్‌నర్, కట్ చేయడం, గోళ్లతో చెరిపేయడం వంటి చర్యలు ట్యాంపరింగ్‌గా పరిగణిస్తామని ఆయన చెప్పారు. ఈ పరీక్షల్లో నాలుగు సిరీస్‌లు (A, B, C, D) ఉంటాయని, 1/3 నెగెటివ్ మార్కింగ్ అమల్లో ఉంటుందని గుర్తు చేశారు. అన్ని పరీక్షల ఫలితాలు సెప్టెంబర్ చివరి నాటికి ప్రకటిస్తామని రాజా బాబు తెలిపారు.