తిరుమల శ్రీవారికి ప్రతి రోజూ భక్తులు విభిన్న రూపాల్లో విరాళాలు అందిస్తుంటారు. డబ్బు, బంగారం, వెండి, విలువైన వస్తువులు మాత్రమే కాకుండా, కొంతమంది టీటీడీ ట్రస్ట్‌లకు విరాళాలు ఇస్తారు. తాజాగా ఒక భక్తుడు మాత్రం వినూత్నమైన కానుకను సమర్పించారు. చెన్నైకి చెందిన స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సీఈవో గణేష్ మణి, సీసీఓ వెంకటరమణన్ కలిసి రూ.1.33 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ బస్సును టీటీడీకి అందించారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ బస్సును ధర్మ రథాల కింద భక్తుల రవాణా కోసం ఉచితంగా వినియోగించే అవకాశముంది.
ఇదిలా ఉంటే, రెండు రోజుల క్రితం తిరుపతికి చెందిన టాటా మోటార్స్ వరలక్ష్మీ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా ఒక విరాళం ఇచ్చింది. వారు రూ.5.06 లక్షల విలువైన టాటా ఏస్ ప్రో వాహనాన్ని టీటీడీకి సమర్పించారు. ఆలయ పేష్కార్ రామకృష్ణకు తాళాలు అందజేసే ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అదేవిధంగా, శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం (తిరుపతి), నారాపుర శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం (జమ్మలమడుగు), ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం (కోసువారిపల్లి) లో పవిత్ర ప్రతిష్ట, పవిత్ర సమర్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. యాగశాలలో హోమాలు, పూర్ణాహుతులు నిర్వహించగా, ఉత్సవమూర్తులతో తిరువీధి ఉత్సవాలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో టిటిడి అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.