ఈ సంవత్సరం వరుస ప్రకృతి విపత్తులు ప్రపంచ దేశాలను ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా ఫిలిప్పీన్స్‌లో 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల కారణంగా బోహోల్ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగి పడి అనేక ఇళ్లు, భవనాలు కూలిపోయాయి. కనీసం 31 మంది మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
మంగళవారం సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో ఈ భారీ భూకంపం నమోదైంది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంప కేంద్రం బోహోల్ ప్రావిన్స్‌లోని కలపే ప్రాంతానికి తూర్పు-ఆగ్నేయ దిశగా 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ భూకంపం వల్ల బోగో నగరం దగ్గర ఎక్కువ ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం. 22కి పైగా భవనాలు ధ్వంసమయ్యాయి. వాటిలో ఒక పురాతన రాతి చర్చ్ కూడా ఉంది.
భూకంపం సంభవించిన వెంటనే ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఆ తర్వాత పరిస్థితి అంచనాకంటే తక్కువగా ఉండటంతో హెచ్చరికను ఉపసంహరించుకుంది. అయినప్పటికీ భయంతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. కొండచరియలు విరగడంతో పర్వత ప్రాంతాల్లో అనేక ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కమ్యూనికేషన్, విద్యుత్ సరఫరా కొంతమేర నిలిచిపోయినా అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. తీర ప్రాంత ప్రజలకు బీచ్‌లకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. కలపేలో నివసిస్తున్న సుమారు 33,000 మంది ప్రజలు భయాందోళనలో ఉన్నారని స్థానిక అధికారులు వెల్లడించారు.
ఫిలిప్పీన్స్ పసిఫిక్ మహాసముద్రంలోని "రింగ్ ఆఫ్ ఫైర్" ప్రాంతంలో ఉండటంతో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. వీటిలో చాలా వరకు తక్కువ తీవ్రతగలవే. అయితే ఈసారి సంభవించిన భూకంపం ప్రాణనష్టం, ఆస్తి నష్టం కలిగించడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.