ఎస్బీఐ పీవో మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) నియామకానికి సంబంధించిన కీలక అప్‌డేట్ వచ్చింది. ఇటీవల ఆగస్టు 4, 5 తేదీల్లో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలను ప్రకటించిన ఎస్బీఐ, ఇప్పుడు మెయిన్స్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సెప్టెంబర్ 13న ఎస్బీఐ పీవో మెయిన్స్
ఎస్‌బీఐ పీవో మెయిన్స్ పరీక్షను కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 13న దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మొత్తం 541 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఎస్బీఐ ఈ ఎంపిక ప్రక్రియ చేపడుతోంది. ప్రిలిమ్స్, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులకే తుది నియామకం లభిస్తుంది.
ఎన్‌డీఏ, సీడీఎస్ పరీక్షలకూ హాల్‌టికెట్లు విడుదల
ఇక నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), నావల్ అకాడమీ (NA), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS) పరీక్షలకు కూడా యూపీఎస్సీ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. సెప్టెంబర్ 14న దేశవ్యాప్తంగా ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.