రేణిగుంట విమానాశ్రయంలో స్పైస్ జెట్ సేవలపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు రానున్న విమానం రద్దు కావడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. సాయంత్రం నుంచే విమానం కోసం వేచి ఉన్నప్పటికీ, ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంపై విమానాశ్రయం లోపల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం, 8.45 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరాల్సిన విమానం ముందస్తు సూచన లేకుండా రద్దు కావడం పెద్ద ఇబ్బందులకు గురి చేసింది. తమ షెడ్యూల్‌లు, పనులు భంగం చెందాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం వల్ల అసౌకర్యం మరింత పెరిగిందని వాపోయారు.
సమస్యపై వెంటనే స్పందించాలని విమానాశ్రయ అధికారులను ప్రయాణికులు డిమాండ్ చేశారు. ప్రయాణికుల ఆగ్రహం వల్ల విమానాశ్రయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా నిర్లక్ష్యంగా విమాన సర్వీసులను రద్దు చేయడం అన్యాయం అని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.