అమెరికా కొన్ని భారతీయ ఉత్పత్తులపై కొత్తగా సుంకాలు విధించినప్పటికీ, ఆ దేశంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వాణిజ్యం మరియు పెట్టుబడులను పెంపొందించేందుకు వాషింగ్టన్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద మంగళవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
ఆగస్టు 7 నుంచి అమెరికా కొంత భారతీయ ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సుంకాలు భారత ఎగుమతుల సుమారుగా 55 శాతం విలువపై ప్రభావం చూపుతాయని అంచనా. ఆగస్టు 27 నుంచి మరికొన్ని వస్తువులపై అదనంగా 25 శాతం సుంకాలు విధించనున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక రంగాలపై ఇంకా సుంకాలు విధించలేదని స్పష్టం చేశారు.
జితిన్ ప్రసాద మాట్లాడుతూ, అమెరికా సుంకాలు ముఖ్యంగా టెక్స్టైల్ రంగంపై ప్రభావం చూపవచ్చని, అయితే ఉత్పత్తి నాణ్యత, డిమాండ్, ఒప్పందాలు వంటి అంశాలు దీనిని ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. ఎగుమతిదారులు, పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వ సంప్రదింపులు కొనసాగుతున్నట్లు తెలిపారు. రైతులు, కార్మికులు, ఎంఎస్ఎంఈల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని హామీ ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న సుంకా నిర్ణయాలను భారత ప్రభుత్వం "అన్యాయమైనవి, అహేతుకమైనవి" అని అభివర్ణించింది. భారతదేశ ప్రజల ఇంధన భద్రత దృష్టిలో ఉంచుకొని మాత్రమే దిగుమతులు ఉంటాయని, ఇతర దేశాలు కూడా జాతీయ ప్రయోజనాల కోసం చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కేవలం భారత్‌పై మాత్రమే సుంకాలు విధించడం దురదృష్టకరమని ప్రకటించింది.
భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలు 2025 మార్చిలో ప్రారంభమై ఐదు విడతల చర్చలు జరిగాయి. చివరిసారి జూలై 14-18 తేదీల్లో వాషింగ్టన్‌లో సమావేశమయ్యారు.