ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 హజ్ యాత్రకు వెళ్లే వారికి శుభవార్త అందించింది. రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ప్రకటించిన ప్రకారం, విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ద్వారా యాత్రకు వెళ్లే ప్రతి యాత్రికుడికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించనున్నారు. 2,649 దరఖాస్తులలో 2,314 మంది అర్హులుగా గుర్తించబడ్డారు. ఇందులో 389 మంది విజయవాడను మొదటి ప్రాధాన్యంగా, 627 మంది రెండవ ప్రాధాన్యంగా ఎంచుకున్నారు.
మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, విజయవాడ ఎంబార్కేషన్ ద్వారా వెళ్లే యాత్రికులకు అదనంగా పడే రూ.70 వేల భారం ప్రభుత్వం భరించనుందని చెప్పారు. గత ఏడాది కూడా 72 మందికి ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున జమ చేసినట్లు గుర్తు చేశారు. ఈ సాయం 2026 హజ్ యాత్రికులకు కూడా వర్తించనుంది.
నంద్యాలలో జరిగిన సమీక్షలో మంత్రి రైతులకు భరోసా ఇచ్చారు. యూరియా కొరత లేదని, మార్కెట్‌యార్డు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతుల అవసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లు, షాపుల నిర్మాణం, మరమ్మతులు వంటి పనులకు రూ.1.70 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు.