ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని దేవాలయాల పవిత్రతను కాపాడుతూ, పర్యావరణ పరిరక్షణ దిశగా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ఆలయాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధం కానుంది. పూజా సామగ్రి కొనుగోలు నుంచి ప్రసాదం అందుకునే వరకు ప్లాస్టిక్ వినియోగం దాదాపు నిత్యకృత్యంగా మారిన ఈ పరిస్థితిని మార్చేందుకు దేవాదాయ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఈ నెల 8న జీవో జారీ చేస్తూ, ఆలయ ప్రాంగణంలో ప్లాస్టిక్ కవర్లను, ముఖ్యంగా 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారు. భక్తులు పూజా సామాగ్రిని ప్లాస్టిక్‌లో తీసుకురావడాన్ని ఆపేందుకు, అలాగే ప్రసాదం ప్యాకేజింగ్‌లో కూడా ప్లాస్టిక్ వినియోగం నిలిపివేయాలని ఆదేశించారు. దాని బదులు అరిటాకులు, విస్తరాకుల కప్పులు, లేదా పర్యావరణ హితమైన ప్యాకేజింగ్ వాడాలని సూచించారు.
అలాగే ఆలయాల్లో త్రాగునీరు స్టీల్ గ్లాసులలో మాత్రమే అందించాలి, ప్లాస్టిక్ గ్లాసులు మరియు బాటిల్స్ వినియోగాన్ని నిలిపివేయాలి అని స్పష్టం చేశారు. ఆలయ దుకాణ సముదాయంలో ప్లాస్టిక్ కవర్లు విక్రయించిన వారిపై ప్రతిరోజూ తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. భక్తులు కూడా ప్లాస్టిక్ తీసుకురాకుండా ముందుగానే హెచ్చరించడానికి ఆలయ ప్రాంగణంలో మరియు దుకాణాల వద్ద సూచన బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించబడతాయని అధికారులు హెచ్చరించారు. ఈ చర్యలతో ఆలయాలు పర్యావరణ హితంగా, మరింత పవిత్రమైన వాతావరణంతో మారుతాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది.