ఆంధ్రప్రదేశ్‌లోని ఆశా వర్కర్లకు ఏపీ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా మూడు కీలక శుభవార్తలు అందించింది. ఆశా కార్యకర్తల సంక్షేమం కోసం ప్రభుత్వం మూడు ప్రధాన నిర్ణయాలు తీసుకుని, వాటికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ఆశా కార్యకర్తలకు మొదటి రెండు ప్రసవాల కోసం 180 రోజుల చొప్పున వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు (Paid Maternity Leave) మంజూరు చేయనున్నారు. అదేవిధంగా, ఆశా వర్కర్ల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచారు.
గ్రాట్యూటీ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. సర్వీస్ పూర్తిచేసిన ఆశా వర్కర్లకు, సంవత్సరానికి నెలవారీ గౌరవ వేతనంలో 50% (అంటే ₹5,000) చెల్లించనున్నారు. గరిష్టంగా ₹1,50,000 వరకు గ్రాట్యూటీ అందుతుంది. రాష్ట్రంలో మొత్తం 42,752 మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. వీరిలో 37,000 మంది గ్రామీణ ప్రాంతాల్లో, 5,735 మంది పట్టణ ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు. గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో వీరి పాత్ర కీలకం.
ప్రస్తుతం ప్రభుత్వం ఆశా వర్కర్లకు నెలకు ₹10,000 గౌరవ వేతనం ఇస్తోంది. అయితే, అదనపు ఆర్థిక ప్రయోజనాలు లేవు. ఈ నేపథ్యంలోనే సీఎం నారా చంద్రబాబు నాయుడు మార్చిలో జరిగిన ఆరోగ్య శాఖ సమీక్షలో ఈ మూడు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఆ నిర్ణయాలను అమల్లోకి తేవడానికి ఉత్తర్వులు విడుదల అయ్యాయి. దీతో ఆశా వర్కర్లకు ఉపాధి భద్రతతో పాటు ఆర్థిక భరోసా మరింత పెరిగింది.