ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు మరో సువర్ణావకాశం కల్పించింది. స్త్రీనిధి, బ్యాంకు లింకేజీల ద్వారా రుణాలు ఇస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. పంట పొలాల్లో పురుగుమందులు పిచికారీ చేయడానికి డ్రోన్లు రాయితీపై అందించనుంది. దీనికోసం మండలాల వారీగా మహిళలను ఎంపిక చేసి, డ్రోన్ల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా వరి, కూరగాయలు పండించే రైతులకు ఈ డ్రోన్లు ఎంతో ఉపయోగపడతాయి.
ఎంపికైన మహిళలకు ప్రభుత్వం భారీ సబ్సిడీ ఇస్తోంది. రూ.10 లక్షల విలువ గల డ్రోన్‌ను రూ.8 లక్షల రాయితీతో అందించనుంది. మిగిలిన రూ.2 లక్షలు స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా మహిళా సంఘాలు చెల్లిస్తాయి. ఐదుగురు మహిళలు కలిసి ఈ మొత్తం భరించవచ్చు. డీహెచ్–ఏజీ–ఈ10 మోడల్ డ్రోన్లు రాష్ట్రానికి రానున్నాయి. ఇవి తేలికపాటి బరువుతో, బ్యాటరీ ఆధారితంగా పనిచేస్తాయి.
డ్రోన్ల వాడకం వల్ల రైతులకు అనేక లాభాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మాన్యువల్‌గా పిచికారీ చేసే సమయంలో కలిగే ఆరోగ్య సమస్యలు నివారమవుతాయి. ఒక ఎకరాకు 5–7 నిమిషాల్లో పిచికారీ చేయవచ్చు. రసాయనాల వినియోగం 10% వరకు తగ్గుతుంది. రైతులు డ్రోన్లను అద్దెకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం ఎకరానికి రూ.500 అద్దె రేటు ఉంది. ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు ఉపాధి, రైతులకు లాభం రెండూ కలుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆసక్తి గల వారు తమ సెర్ప్ లేదా మండల వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించవచ్చు.