ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో మురుగు నీటి సమస్య ఎప్పటినుంచో పెద్ద సవాలుగా నిలుస్తోంది. రోడ్ల నిర్మాణంలో భారీగా పెట్టుబడులు పెట్టినా, వాటికి సరిపడా డ్రైన్లు లేకపోవడం వల్ల చాలా గ్రామాలు చెత్త, చెదారం పేరుకుపోయి దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కొత్త ఆవిష్కరణతో ముందుకు వచ్చింది. తక్కువ వ్యయంతో, ఎక్కువ ప్రయోజనం అందించే “మేజిక్ డ్రైన్లు” నిర్మాణాన్ని ప్రారంభించింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4 వేలకి.మీ. సిమెంట్ రోడ్లు గ్రామాల్లో నిర్మించారు. కానీ, ఆ రోడ్లకు పక్కనే కాల్వలు లేకపోవడం లేదా ఉన్నవాటిని సరిగా నిర్వహించకపోవడం వల్ల సమస్యలు మరింత పెరిగాయి. కాల్వలు చెత్తతో నిండిపోవడం, వర్షాకాలంలో నీరు నిలిచి దుర్గంధం వ్యాపించడం, రోడ్లు పాడైపోవడం వంటి సమస్యలు వెలువడ్డాయి. దీంతో, కొన్ని గ్రామాల్లో డ్రైన్లు నిర్మించాలా వద్దా అన్న చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే నిర్మించిన డ్రైన్లు సరిగా ఉపయోగించలేక పగులగొట్టిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
ఈ పరిస్థితిని మార్చేందుకు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ముందడుగు వేశారు. ఇటీవల కృష్ణా జిల్లా నందిగామ మండలంలోని సోమవరం గ్రామంలో మేజిక్ డ్రైన్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇదే నమూనాను ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పరిశీలించారు.
సిమెంట్ డ్రైన్లకు సుమారు రూ.4 లక్షల వ్యయం అవుతుంటే, మేజిక్ డ్రైన్ నిర్మాణానికి కేవలం రూ.90 వేల రూపాయలతో పూర్తవుతోంది. ఇది ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నిధుల పొదుపు అవ్వటమే కాకుండా, గ్రామాలకు తొందరగా పరిష్కారం అందిస్తోంది.
మేజిక్ డ్రైన్లు సాధారణ డ్రైన్లలాగా కాకుండా మూడు లేయర్ల టెక్నాలజీతో నిర్మిస్తారు. మొదట మురుగు నీరు వెళ్లే సైడ్ కాల్వ తవ్వుతారు. ఆ తర్వాత ఒక్కో లేయర్ను ఒక్కో సైజ్ రాళ్లతో, మెటల్‌తో భర్తీ చేస్తారు. ప్రతి 50 మీటర్లకి సోక్ పిట్ ఏర్పాటు చేసి, ఇళ్ల నుంచి వచ్చే నీరు ఎక్కడికక్కడ నేలలో కలిసిపోయేలా చేస్తారు. ఈ విధానం వల్ల నీరు నిల్వ ఉంటుంది, భూగర్భజల వనరులు కూడా పెరిగే అవకాశమూ ఉంటుంది.
చాలా గ్రామాల్లో రోడ్లు సన్నగా ఉండడం వల్ల సాధారణ డ్రైన్లు నిర్మించడం కష్టతరంగా మారింది. ఇలాంటి చోట్ల మేజిక్ డ్రైన్లు సరైన ప్రత్యామ్నాయం అవుతున్నాయి. తక్కువ నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలకు ఇవి అనువుగా ఉంటాయి. నీటి నిల్వలు లేకుండా శుభ్రమైన వాతావరణం ఏర్పడుతుంది.
పంచాయతీరాజ్ శాఖ అక్టోబర్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 100 గ్రామాల్లో మేజిక్ డ్రైన్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి జిల్లాలో కనీసం నాలుగు గ్రామాలను ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమవడంతో, దీన్ని అంచెలంచెలుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.
గ్రామాల్లో చెత్త, చెదారం వాసనతో ఇబ్బందులు పడిన ప్రజలు ఇప్పుడు మేజిక్ డ్రైన్లపై ఆశలు పెట్టుకున్నారు. తక్కువ ఖర్చుతో డ్రైన్లు నిర్మిస్తే, పంచాయతీలకు కూడా భారమవదు. గ్రామాల్లో శుభ్రత, ఆరోగ్యకర వాతావరణం ఏర్పడుతుందని గ్రామస్థులు భావిస్తున్నారు.