ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కొత్త కార్యవర్గ ఎన్నికలు తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌లో ఏకగ్రీవంగా ముగిశాయి. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. సాంకేతిక కారణాల వల్ల ఉపాధ్యక్ష పదవి ఎన్నిక వాయిదా పడింది. మొత్తం 34 మందితో నూతన కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ మూడేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించనుంది.
మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు.
కేశినేని చిన్ని హామీ.
అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కేశినేని చిన్ని మాట్లాడుతూ – “మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తాం. స్టేడియాల్లో మౌలిక వసతులు కల్పించి, అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లను ఏపీ నుంచి తీర్చిదిద్దడమే లక్ష్యం. క్రీడాకారులకు అవసరమైన కోచింగ్, సపోర్ట్ స్టాఫ్‌ను అందిస్తాం” అన్నారు.
అలాగే ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతున్న ఏపీఎల్ సీజన్–4 విజయవంతంగా సాగుతోందని, ఏసీఏ ప్రతిష్ఠను మరింతగా పెంచేలా పని చేస్తామని హామీ ఇచ్చారు.