ఏపీలో ఇళ్ల పట్టాలు పొంది, ప్రభుత్వం నుంచి అడ్వాన్స్‌లు తీసుకున్న లబ్ధిదారులకు ఇప్పుడు గృహ నిర్మాణ సంస్థ అధికారులు షాక్ ఇస్తున్నారు. పట్టా తీసుకున్న స్థలంలో వెంటనే ఇల్లు కట్టుకోవాలని, లేని పక్షంలో ప్రభుత్వం ఇచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి చెల్లించాలని నోటీసులు పంపుతున్నారు.
వైసీపీ పాలనలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఒక్కొక్కరికి ₹10 వేల నుండి ₹20 వేల వరకు అడ్వాన్స్‌లు ఇచ్చారు. అయితే కొంతమంది లబ్ధిదారులు స్థలం నచ్చకపోవడం గానీ, ప్రభుత్వం ఇచ్చిన సాయం తక్కువనిపించడం గానీ కారణంగా ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించలేదు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎస్సీ, బీసీ వర్గాల వారికి అదనంగా ₹50 వేల సహాయం, ఎస్టీ వర్గాలకు ₹75 వేల చొప్పున సాయం అందిస్తోంది. అయినప్పటికీ కొంతమంది లబ్ధిదారులు ఇల్లు కట్టడం ప్రారంభించకపోవడంతో అధికారులు చర్యలకు దిగారు.
గృహ నిర్మాణ సంస్థ అధికారులు స్పష్టం చేస్తూ—“పేదలకు పక్కా ఇల్లు కలగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం. అందుకే అడ్వాన్స్ ఇచ్చాం. అయినప్పటికీ ఇల్లు కట్టని వారికి నోటీసులు ఇచ్చాం. వెంటనే పనులు మొదలుపెట్టాలి. లేదంటే అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందే” అని పేర్కొన్నారు.