గీత కార్మికులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. ఇప్పటికే మద్యం షాపులు, బార్‌ల కేటాయింపులో రిజర్వేషన్ కల్పించిన కూటమి ప్రభుత్వం, తాజాగా ‘ఆదరణ 3.0’ పథకం ద్వారా గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు అందజేయనున్నట్లు మంత్రి ఎస్.సవిత ప్రకటించారు.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీ మహానేత సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతిని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించారు.
మంత్రి సవిత మాట్లాడుతూ.. “లచ్చన్న స్ఫూర్తితోనే సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. తాటి చెట్లు ఎక్కే కార్మికులకు ఆధునిక పరికరాలు అందిస్తాం. తాటి ఉత్పత్తుల ద్వారా ఉపాధి కల్పనకు రంపచోడవరం ఉద్యాన పరిశోధన కేంద్రంలో చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. “పల్లెటూరి పేదరికంలో పుట్టి, 95 ఏళ్ల వయసులోనూ రాజకీయాల్లో చురుకుగా కొనసాగిన లచ్చన్న గారు అందరికీ స్ఫూర్తి” అన్నారు.
ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. బీసీ నేతల గౌరవానికి తెదేపా పాలనే ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.